- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘‘ధరణి’’ లీలలు.. మళ్లీ వ్యవసాయ భూములుగా మారుతోన్న ప్లాట్లు!
‘బుల్కాపూర్’పై పెద్దోళ్ల కన్ను పడింది. అక్కడ దశాబ్దాల క్రితమే పలు సర్వే నెంబర్లలో అగ్రికల్చర్ ల్యాండ్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేశారు. అయితే ధరణి వచ్చాక.. ఆ ప్లాట్లన్నీ వ్యవసాయ భూములుగా మారిపోయాయి. పాతవారి పేర్లమీదే పట్టా పాస్ బుక్కులు జారీ అయ్యాయి. సమస్య పరిష్కారానికి ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో యజమానుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్ పర్సన్ ఆ ప్లాట్లను తక్కువ ధరకే వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారు. అధిక ధరకు ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇలా ధరణి పోర్టల్ ఉన్నోళ్లకు చుట్టంగా మారుతున్నది. రికార్డుల ప్రక్షాళనను అపహస్యంగా మార్చి, ప్లాట్ల యజమానుల నోట్లో మట్టి కొడుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగోముల సర్వే నం.154, 155, 157లలోని 16 ఎకరాల్లో 1989 లోనే శ్రీసాయిబాబానగర్ పేరుతో ప్లాట్లుగా అమ్మేశారు. దానిపై కన్నేసిన కొందరు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తన కుటుంబ సభ్యుల పేరిట ప్లాట్ల స్థలాన్ని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత అమ్మేసి చేతులు దులిపేసుకున్నారు.
ఆయన్ని చూసి కొందరు నాయకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా 1986లోనే అమ్మేసిన ప్లాట్ల స్థలాన్ని కొనుగోలు చేసి మళ్లీ బేరానికి పెట్టాయి. జీవో 111 అమల్లోకి రాకముందే చోటు చేసుకున్న సేల్ డీడ్స్‌కి విలువ లేకుండా చేసేశారు. ప్లాట్ల యజమానులు అటు వైపు కూడా కన్నెత్తి చూడకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారు. చేతిలో సేల్ డీడ్స్ పెట్టుకొని ఏ అధికారికి మొరపెట్టుకున్నా పరిష్కరించడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. రూ.100 కోట్ల విలువ జేసే ఆ ప్లాట్ల స్థలాన్ని స్వాహా చేశారు. ధరణి పోర్టల్ ఇలాంటి అనేక అవకతవకలతో అభాసుపాలవుతున్నది.
1986లోనే ప్లాట్లు
బుల్కాపూర్ సర్వే నం.71, 72, 73, 74, 75, 76 ల్లో ప్లాట్లు చేశారు. 1986లోనే గ్రామ పంచాయతీ లే అవుట్లు చేసి వందలాది మందికి అమ్మేశారు. అప్పట్లో భానూర్‌లో బీడీఎల్ ఫ్యాక్టరీ వస్తుందని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రచారం చేశారు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన వారే కాకుండా తెనాలి, గుంటూరు, విజయవాడకు చెందిన వారు కూడా ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ వెంచర్లను పట్టాదారులు సంయుక్తంగా కాకుండా విడివిడిగా చేశారు. ఎవరి ల్యాండ్‌లో వారి ప్లాట్లకు 1 నుంచి నంబర్లు వేసి అమ్మేశారు. దాంతో ఒకటే వెంచర్ కాకుండా వేర్వేరుగా రికార్డుల్లో దర్శనమిస్తున్నాయి. లే అవుట్ కామన్‌గా ఉన్నప్పటికీ నంబర్లు మాత్రం విడివిడిగా చేసి క్రయ విక్రయాలు నడిపారు. ఇదంతా జీవో 111 అమల్లోకి రాకముందే చోటు చేసుకోవడం గమనార్హం.
నో మ్యుటేషన్
వెంచర్లుగా మారినా కొన్నేండ్ల పాటు రెవెన్యూ రికార్డుల్లో ప్లాట్లుగా రాశారు. ఆ తర్వాత వ్యవసాయ భూమిగా మార్చేశారు. కొన్ని సందర్భాల్లో ప్లాట్లు, మరికొన్ని పహానీల్లో సాగు భూమిగా గందరగోళాన్ని సృష్టించారు. ఇక జీవో 111 అమల్లోకి రాగానే ప్లాట్లను కాస్త వ్యవసాయ భూమిగా మార్చేశారు. 2004 కి ముందు తమదే భూమియంటూ పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు.
అప్పట్లో రియల్ ఎస్టేట్ బూమ్ రాగానే మళ్లీ సాగు భూములుగా అమ్మేశారు. ప్లాట్లుగా కొన్ని వేలాది డాక్యుమెంట్లు అయ్యాయి. అలాగే వ్యవసాయ భూమిగానూ 450కి పైగా ట్రాన్సక్షన్స్ జరగడం విశేషం. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మ్యుటేషన్ చేసుకునే ఆప్షన్ అప్పట్లో లేదు. సేల్ డీడ్ కాపీ తప్ప తనదని చెప్పుకునేందుకు వారి దగ్గర వేరే పత్రాలేవీ ఉండవు. కాకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, వెబ్ సైట్ లో మాత్రం ఎప్పుడు కొనుగోలు చేశారన్న వివరాలు కనిపిస్తాయి. అయితే మ్యుటేషన్ కి నోచుకోని భూములపై ప్లాట్లుగా అమ్మేసిన వారే మళ్లీ మళ్లీ సొమ్ము చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కొన్నది పెద్దలే..
బుల్కాపూర్ సిటీకి, ఐటీ కారిడార్ కి దగ్గరే. ఔటర్ రింగ్ రోడ్డు చేరుకునేందుకు కొన్ని నిమిషాలే పడుతుంది. అందుకే ఇక్కడి భూములపై పెద్దోళ్ల కన్ను పడింది. ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్ పర్సన్ కూడా ప్లాట్ల భూమిని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారు. తక్కువ ధరకే 4 ఎకరాల వరకు సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే వేరే వాళ్లకు అమ్మేసినట్లు తెలిసింది. లహరీ హాలీ డే హోమ్స్, మైరాన్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్, నీరజ్ రెడ్డి ఇన్ఫ్రా బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్ వంటి పలు కంపెనీలు ప్లాట్లుగా అమ్మేసిన భూములనే తిరిగి కొనుగోలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి.
వీరందరికిప్పుడు రైతుబంధు సొమ్ము వారి ఖాతాల్లో పడుతుంది. ఆఖరికి ఫంక్షన్ హాల్ కూడా కట్టేశారు. కొందరు ఎత్తయిన గోడలు కట్టుకొని లోపలికి ఎవరినీ రానివ్వకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్లాట్ల భూములను రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ కంపెనీలే కొనుగోలు చేయడంతో బాధితుల మొర ఎవరికీ వినిపించడం లేదు. ఈ కంపెనీలు కూడా ప్లాట్లుగా అమ్మేసినట్లు ఈసీలో స్పష్టమవుతున్నది.
రికార్డుల ప్రక్షాళన ఏది?
2017లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగేటప్పుడు కూడా ప్లాట్ల యజమానులు మొర పెట్టుకున్నారు. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు. తాము 1986లోనే ప్లాట్లు కొనుగోలు చేశామంటూ ఆధారాలన్నీ చూపారు. సేల్ డీడ్స్ సమర్పించారు. రెవెన్యూ అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. 300లకు పైగా ప్లాట్లు అమ్మేసినట్లు గుర్తించారు. అయినా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం విశేషం. దీని వెనుక అప్పట్లో మంత్రిగా పని చేసిన నేత చక్రం తిప్పారని ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.
అందుకే ఆయన కుటుంబ సభ్యుల పేరిట కూడా భూములు కనిపించాయంటున్నారు. ఇప్పుడు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ఈసీ చూస్తే ప్లాట్లుగా క్రయ విక్రయాలు జరిగినట్లు స్పష్టమవుతుంది. 2007 నుంచి నేటి వరకు లెక్కిస్తేనే 477 ట్రాన్సక్షన్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్కో దాని కింద నాలుగైదు లింక్ డాక్యుమెంట్లు చూపిస్తున్నాయి. 2007 కి ముందు అంటే 1986 నుంచి ఇంకెన్ని ట్రాన్సక్షన్స్ జరిగి ఉంటాయో అంచనా వేయొచ్చు. ఇవన్నీ దర్శనమిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం భూ రికార్డుల ప్రక్షాళనలోనూ న్యాయం చేయలేదు.
ఎవరైనా ప్లాట్ యజమాని గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార బలమున్న నాయకులు, రియల్టర్లు మాత్రం గజం రూ.వెయ్యి, రూ.2 వేలకు ఇస్తే తీసుకుంటామంటూ పేచీ పెడుతున్నారు. ఎలాగూ ఆ ప్లాట్లు దక్కవన్న హెచ్చరికల మధ్య సేల్ డీడ్స్ చేసేస్తున్నారు. అందుకే ఇప్పటికీ రీసేల్ చోటు చేసుకుంటుండడం గమనార్హం. ధరణి పోర్టల్ లో ఇన్నేసి ఉండగా 100 శాతం స్వచ్ఛతను ఎలా సాధిస్తుందో వేచి చూడాలి. 20 రోజుల్లోనే సంపూర్ణ పరిష్కారాన్ని ఎలా చూపిస్తారో వారికే తెలియాలి.