Partition Issues: విభజన సమస్యల పరిష్కారానికి అధికారులతో కమిటీ..

by Shiva |
Partition Issues: విభజన సమస్యల పరిష్కారానికి అధికారులతో కమిటీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉండిపోయిన వివాదాలను కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారుల స్థాయి కమిటీలు ఏర్పడ్డాయి. తెలంగాణ తరఫున చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు అధికారు ఉండగా.. ఏపీ తరఫున కూడా సీఎస్ అధ్యక్షతన ముగ్గురితో కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే ఈ రెండు కమిటీలు ఫస్ట్ మీటింగ్ నిర్వహించడానికి రెడీ అవుతున్నాయి. ఇందుకు రూపొందించుకోవాల్సిన ఎజెండాపైనా కసరత్తు జరుగుతున్నది. సీఎం రేవం‌త్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఆ రెండు కమిటీల మధ్య తొలి సమావేశం జరగనుంది. మరోవైపు మంత్రుల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉంది. తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం నేతృత్వంలో పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండగా, ఏపీ వైపు నుంచి ఇంకా నిర్దిష్టమైన సమాచారం అందలేదు.

తెలంగాణ తరఫు అధికారుల కమిటీలో చీఫ్ సెక్రటరీ‌తో పాటు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు (విభజన సమస్యల కోసం ఏర్పడిన వివాదాల పరిష్కార కమిటీ బాధ్యులు), సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఉన్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన కమిటీలో సైతం చీఫ్ సెక్రటరీతో పాటు ఆ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. మంత్రుల కమిటీ కూర్పుపై ఇంకా ఎలాంటి సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందజేయలేదు. గత నెల 6న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు మంత్రుల స్థాయి, అధికారుల స్థాయిలో రెండు రాష్ట్రాల తరఫున వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఆ కమిటీలు ఏర్పడ్డాయి.

అధికారుల కమిటీ తొలి సమావేశానికి తయారుచేసుకునే ఎజెండాకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు కూడా భాగస్వాములు కానున్నారు. తొలుత అధికారుల స్థాయిలో ఈ వివాదాలు కొలిక్కి వస్తే దానికి అనుగుణమైన కార్యాచరణ మొదలవుతుంది. ఒకవేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లయితే మంత్రుల స్థాయి కమిటీ చొరవ తీసుకుంటుంది. ముఖ్యమంత్రులు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండు వారాల్లోనే అధికారుల స్థాయి కమిటీలు ఏర్పడి ఫస్ట్ మీటింగ్‌ నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది. కానీ అనుకున్న వి ధంగా కమిటీల ఏర్పాటు షెడ్యూలు ప్రకారం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం తరఫున జూలై 22న అధికారుల, మంత్రుల కమిటీలు ఏర్పడగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఏపీ 11 అంశాలతో ఎజెండాను రూపొందించి తెలంగాణకు పంపినట్లు ఆ రాష్ట్ర సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. తేదీని, ప్లేస్‌ను కూడా ఖరారు చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed