- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్పత్రి భోజనంలో లోపించిన నాణ్యత!
దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందితో పాటు పలు విభాగాల అధిపతుల బదిలీలతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో పనిచేస్తున్న చీఫ్ డైటీషియన్లకు కూడా స్థానచలనం కల్పించింది. అయితే బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా ఆస్పత్రులలో డైట్ సప్లై లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోగులకు క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్ అందడం లేదనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు ప్రతినిత్యం వేల సంఖ్యలో పేద రోగులు వైద్య పరీక్షలు, చికిత్సలకు వస్తుంటారు. వీరిలో అవసరమైన వారిని ఇన్ పేషంట్‌గా చేర్చుకుని వైద్య సేవలతో పాటు ఆహారాన్ని అందిస్తుంటారు. రోగులకు ఉదయం అల్పాహారం, లంచ్, డిన్నర్‌లలో ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది డైటీషియన్లు పరిశీలిస్తుంటారు. అంతేకాకుండా డైట్ సప్లై, డైట్ కౌన్సిలింగ్ (రోగులకు జీవనశైలి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం), ప్రాపర్ డైట్ అడ్వైజ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే బదిలీలతో డైట్ కాంట్రాక్టర్ పై నిఘా లోపం ఏర్పడి అవకతవకలు చోటు చేసుకునే అవకాశాలు ప్రభుత్వమే కల్పించింనట్లు కాగా రోగులకు నాణ్యమైన ఆహార సరఫరా ప్రశ్నార్ధకంగా మారింది.
డైట్ విద్యార్థుల శిక్షణ పై ప్రభావం..
నగరంలోని మూడు ప్రధాన ఆస్పత్రులలో చీఫ్ డైటీషియన్లను బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించక పోవడం తో డైట్ విభాగంలో కొత్తగా వచ్చిన బీఎస్సీ, ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారు లేకుండా పోయారు. సాధారణంగా అన్ని ప్రధాన ఆస్పత్రులలో విభాగాధిపతులతో పాటు ఇతర అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆర్ఎంఓలు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు. వీరంతా తాము పనిచేస్తున్న విభాగాలలో రోగులకు సేవలందిస్తుంటారు. అయితే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డైటిక్స్‌లలో చీఫ్ డైటీషియన్ పోస్టు ఒక్కటే ఉంది. తాజాగా జరిగిన బదిలీలో వీరు బదిలీ కావడం, కొత్తవారిని నియమించకపోవడంతో ఈ విభాగంలో సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కాంట్రాక్టర్లపై కొరవడిన నిఘా..
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో రోగులకు ఆహారం అందించేందుకు టెండర్లు నిర్వహిస్తుంటారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనల మేరకు రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అవసరమైన క్వాంటిటీలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఉస్మానియాలో 1,168, గాంధీలో సుమారు 1,600. నిలోఫర్‌లో సుమారు 1,000 పడకలు ఉండగా ఐపీ రోగులకు నిబంధనల మేరకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. చీఫ్ డైటీషియన్ లేకపోవడంతో ముఖ్యంగా డయాబిటిక్, మూత్రపిండాల (రీనల్) పేపెంట్, కాలేయ సంబంధ రోగులు, కార్డియాక్, పోస్ట్ ఆపరేటివ్ కేసులు, స్థూలకాయం (ఒబేసిటి), రోగులకు, నిలోఫర్‌లో గర్భిణీలు, ప్రసవానంతరం చిన్నపిల్లలకు పోషక ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియకుండా పోవడం తో వారు త్వరగా కోలుకోవడంపై ప్రభావం చూపుతోంది. దీంతో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్న ఆయా ఆస్పత్రులలో సూపర్‌స్పెషాలిటీస్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఎప్పుడు? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి..
బ్రేక్ ఫాస్ట్..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఇడ్లీ (150 గ్రాములు), 100 గ్రాముల సాంబార్/చట్నీ, పొంగల్, కిచిడి, ఉప్మా, బ్రెడ్ స్లైస్‌లు 5లలో ఏదో ఒకటి, ఒక కప్పు (50 ఎంఎల్ మిల్క్) ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి.
లంచ్.. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు రోగులకు లంచ్ సరఫరా చేయాలి. ఇందులో అన్నం, 8 ఇంచుల డయా కలిగిన పుల్కా 600 గ్రాములు, వెజ్ కర్రీ 150 గ్రాములు, ఆకు కూర పప్పు 150 గ్రాములు, 200 ఎంఎల్ సాంబార్, ఉడకబెట్టిన గుడ్డు ఒకటి, 100 ఎంఎల్ పెరుగు, మజ్జిగ అయితే 200 ఎంఎల్, ఒక అరటిపండు ఇవ్వాలి.
డిన్నర్.. డిన్నర్ రాత్రి 6 నుంచి 8 గంటల లోపు ఇవ్వాలి. ఇందులో అన్నం/ఆరు పుల్కాలు మొత్తం 300 గ్రాములు, పుల్కాలు 2, వెజ్ కర్రీ 150 గ్రాములు, ఆకు కూర పప్పు 150 గ్రాములు, సాంబార్ 200 ఎంఎల్, ఉడకబెట్టిన గుడ్డు ఒకటి, 100 ఎంఎల్ పెరుగు మజ్జిగ అయితే 200 ఎంఎల్, అరటిపండు ఇవ్వాలి.
అయితే సెమీ సాలిడ్, లిక్విడ్ డైట్, డయాబిటిక్, రెనల్, కార్డియక్, హై ప్రోటీన్ డైట్ అవసరమయ్యే రోగులకు ఇచ్చే డైట్ మారుతుంటుంది. ఇవన్నీ చీఫ్ డైటీషియన్ పరిశీలించాలి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొత్తవారిని నియమించే వరకు పాతవారికి అదనపు బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.