- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం

దిశ ,జుక్కల్ : పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతుందని, నియోజకవర్గ అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బిచ్కుంద మండలంలోని గుండెకల్లూరు గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం జుక్కల్,మద్నూర్ మండల కేంద్రాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందకూడదని ఆయన సూచించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి దశలవారీగా ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు,బీసీ ఇతర సామాజిక వర్గాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కానీ, రేషన్ కార్డు గాని ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా లేవు అన్నారు.
గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏమి చేయలేని,వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రానున్న రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలువనున్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేష్, బిచ్కుంద, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, దారస్ సాయిలు,డెలిగేట్ విట్టల్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లు శంకర్,రమేష్, నాగనాథ్,అనిల్, శ్రీనివాస్, హనుమంత్ యాదవ్, కొండ గంగాధర్, బాలు యాదవ్, హనుమాన్లు స్వామి, ప్రజ్ఞ కుమార్ తదితరులు పాల్గొన్నారు.