ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఫుడ్ పాయిజన్ ఘటనలు.. PDSU

by Sumithra |
ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఫుడ్ పాయిజన్ ఘటనలు.. PDSU
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ కారణంగా వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతే, పదుల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తే ఎలాంటి స్పందన లేని ఈ ప్రభుత్వానికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల PDSU ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో శనివారం పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన గత ప్రభుత్వం మాదిరిగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే వైఖరి కొనసాగింపుగా ఉందన్నారు. ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఎన్ని సార్లు చెప్పినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు.

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించి అనారోగ్యానికి గురయ్యారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలను కూడా కోల్పోయారు. ఎప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సిగ్గుచేటు అని, ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని వారన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని, జక్రాన్ పల్లి, ఆర్మూర్, ఇస్సపల్లి, బాల్కొండలో స్కూల్ బంద్ నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకొని విద్యాశాఖ మంత్రి కేటాయించి మధ్యాహ్న భోజనం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా కార్యదర్శి, నిఖిల్, నాయకులు సాయిరాజ్, జంపా, బిరు గొండ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story