బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలి.. ప్రజా సంఘాల డిమాండ్

by Sumithra |
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలి.. ప్రజా సంఘాల డిమాండ్
X

దిశ, నిజామాబాద్ సిటీ : మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద బ్రిజ్ భూషణ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా భాద్యులు వి.ప్రభాకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు వి.ప్రభాకర్, సీఐటీయూ జిల్లా భాద్యులు రమేష్ బాబు, రైతుసంఘ బాధ్యులు కే.రాజన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.దేవారం, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా బాధ్యులు గంగాధర్ లు మాట్లాడుతూ ఢిల్లీలో మహిళా రెజ్లర్ల పై కేంద్ర పోలీసు బలగాల నిర్బంధాన్ని, ధమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

క్రీడాకారిణిల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే అరెస్టు చేయాలని, బాధ్యతల నుండి తొలగించి, చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులుగా కొనసాగుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై గతంలోనే అనేక కేసులు, ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. క్రీడాకారుల పై బహిరంగంగానే వివాదాస్పదంగా వ్యవహరించిన ఘటనలు ఉన్నాయని అన్నారు. రెజ్లింగ్ మహిళా క్రీడాకారినిల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, క్రీడాకారులను శారీరకంగా హింసించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని, బ్రిజ్ భూషణ్ను శిక్షించాలని భారత రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ప్రజాస్వామ్య యుతంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారత ప్రధాని మోడి, క్రీడాశాఖ మంత్రులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు.

రెజ్లింగ్ క్రీడాకారులు ఒలంపిక్స్, ప్రపంచ కప్ మొదలగు పోటీల్లో భారతదేశానికి పథకాలు తీసుకొచ్చినప్పుడు తమ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొని, క్రీడాకారులతో ఫోటోలు దిగిన ప్రధాని మోడి, క్రీడామంత్రులు ఇప్పుడు మొహం చాటేయడం అనైతికం అని అన్నారు. ఒకవైపు బేటి పడావో బేటి బచావో అని మన్ కీ బాత్ చెప్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, మహిళా క్రీడాకారులు దేశ రాజధానిలో ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే వారితో మాట్లాడడం గాని, మంత్రుల ద్వారా చర్చించడం గాని చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. భారత ప్రధాని వైఖరి రేపిస్టులను, మహిళల పై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కాపాడే విధంగా ఉండటం విచారకరమని అన్నారు.

ఇది ఏమాత్రం క్షమార్హం కాదని, మహిళా క్రీడాకారుల పై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే సమాఖ్య బాధితుల నుంచి తొలగించాలని, అతన్ని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్, జిల్లా అధ్యక్షులు పి.వెంకటేష్, ఐఎఫ్టీయు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షులు గోవర్దన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed