పైసా దేదో.. పర్మిషన్ లేలో

by Naveena |   ( Updated:2024-12-20 17:09:52.0  )
పైసా దేదో.. పర్మిషన్ లేలో
X

దిశ, కామారెడ్డి : ఏదైనా ప్రాపర్టీ అమ్మారా.. దాంతో ఓ కొత్త ఇల్లు కట్టుకోవాలా..అయితే అనుమతి కోసం కనీసం చేతిలో తక్కువలో తక్కువ 10 లక్షలైనా ఉండాల్సిందే. ఇల్లు కట్టడానికి కాదండోయ్..మధ్యలో నాయకులకు మామూళ్లు ఇవ్వడానికి. ఎందుకివ్వాలి అని అడిగితే మాత్రం ఇక మీ ఇల్లు నిర్మాణం అయినట్టే. ఈ తంతు ఎక్కడో మారుమూల గ్రామంలో జరుగుతుందంటే పొరపాటే సుమా.. ఏకంగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో జరుగుతున్న తతంగం ఇది.

కట్టడానికి ఒక రేటు

కామారెడ్డి మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఇల్లు కట్టుకోవడానికి అడ్డదిడ్డమైన రూల్స్ అడ్డు వస్తున్నాయి. రూల్స్ అన్ని దాటుకుని వెళ్తే మధ్యలో బ్రోకర్లు, మెయిన్ లీడర్లకు కొంత నగదు ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితులు కామారెడ్డి మున్సిపాలిటీలో దాపురించాయి. ఐదో పదో అంటే ఎలాగోలా ఇయ్యొచ్చు. కానీ లక్షల్లో ఇవ్వాల్సి రావడంతో ఇంటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఇంటి నిర్మాణ ధరను బట్టి మామూళ్ల రేటు నిర్ణయించడం ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్. అందుకే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డబ్బులివ్వకుంటే తిరగాల్సిందే

ఇటీవల కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో ఫైవ్ మెన్ కమిటీ అని కొత్తగా అవతరించింది. మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ కమిటీ వద్దకు వెళ్లాల్సిందే. ఈ కమిటీ చెప్పిన రేటుకు ఒకే అనుకుంటే ఆ పని అయిపోయినట్టే. ఇళ్ల నిర్మాణానికి కూడా ఈ కమిటీ ఫైనల్ రేట్ డిసైడ్ చేస్తుందన్న ప్రచారం ఉంది. కమిటీని కాదని వెళ్లాలంటే ప్రధాన నాయకుని వద్దకు వెళ్లాల్సిందే. అక్కడ ఫైనల్ రేట్ ఇవ్వకపోతే అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా తిరిగి తిరిగి విసుగు చెంది ఏదైనా కానీ అని ఇంటి నిర్మాణం చేపడితే అక్రమ కట్టడం పేరుతో కూల్చివేతలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

వసూళ్లకు కాదేదీ అనర్హం

కామారెడ్డి మున్సిపాలిటీలో వసూళ్ల పర్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు గిరాకీ బాగా ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇల్లు కట్టుకునే వ్యక్తి ఎవరైనా, పలుకుబడి ఏదైనా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మున్సిపాలిటీలో నాయకునిగా చెలామణి అయిన సొంత పార్టీ నాయకుని వద్దే సుమారు 20 లక్షలకు పైగా ఇస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారంటే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇట్టే అర్థం అవుతోంది. మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ నయా వసూళ్లపై ఉన్నతాధికారులు స్పందించి సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed