అద్దె కడతారా.. ఆఫీసుకు తాళం వేయమంటారా..?

by Disha News Web Desk |
అద్దె కడతారా.. ఆఫీసుకు తాళం వేయమంటారా..?
X

దిశ, బాన్సువాడ: ఆలోచన బాగున్నా.. ఆచరణలో విఫలమైతే.. అడుగడుగునా అవస్థలే దిక్కు అనడానికి కొత్త మండల కేంద్రాల ఏర్పాటే ప్రత్యక్ష ఉదాహరణ. నిధుల కొరతతో అధికారులు అవస్థలు పడుతున్నారు. స్థానిక పాలన కుంటుపడుతున్నది.

వర్ని మండలాన్ని విభజించి చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రజాభీష్టం మేరకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, మండలాల ఏర్పాటు తర్వాత ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అధికారుల పరిస్థితి ''ముందు నుయ్యి వెనక గొయ్యి''లా మారింది. నిధుల కొరతతో పాలన స్తంభించి పోతున్నది. అధికారుల జీతాల్లోంచి ఖర్చులు భరించాల్సిన దుస్థితి నెలకొంది. కక్కలేని మింగలేని పరిస్థితుల్లో అధికారులు లోలోన కుమిలిపోతున్నారు. నిధుల ప్రతిపాదనలు, దస్త్రాలకే పరిమితం కావడం ఉద్యోగుల్లో నిరుత్సాహాన్ని మిగిలిస్తున్నది.

చందూర్ మండలం కొత్తగా ఏర్పాటయ్యాక అద్దె భవనంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయం ఏర్పాటయ్యాక దాదాపు ఏడాదిన్నర వరకు భవన యజమానికి అద్దె చెల్లించలేదు. దీంతో ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేస్తానని, భవన యజమాని హెచ్చరించడంతో అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అద్దె బకాయి మొత్తాన్ని తన ప్రత్యేక నిధుల నుంచి కేటాయించి సమస్యను పరిష్కరించారు. దీంతో అప్పుడు సమస్య పరిష్కారం అయ్యింది. ప్రస్తుతం అద్దె బకాయిలు మళ్ళీ ఏడాది వరకు పేరుకుపోయాయి. భవన యజమాని మళ్ళీ అద్దె బకాయిల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిధులు లేకపోవడంతో అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. 15 ఫైనాన్స్ నిధులు వచ్చినా, కేవలం అభివృద్ధి పనుల కోసమే వీటిని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కార్యాలయ నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు అవస్థలు పడుతున్నారు. స్టేషనరీ, కరెంట్ బిల్లులు, వసతుల నిర్వహణ ఖర్చులు కష్టంగా మారాయి. అలాగే మండల అభివృద్ధి కార్యాలయానికి వాహన సౌకర్యం కూడా లేదు. దీంతో అధికారులు గ్రామాల్లో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. అభివృద్ధి పనులను తనిఖీ చేయలేని దుస్థితి నెలకొంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యలపై ప్రశ్నిస్తుంటే, అధికారులు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిధుల విడుదల విషయంలో, ప్రభుత్వ విధానలను బయటకు చెప్పలేని దుస్థితి అధికారుల్లో కనిపించడం విచారకరం.

అద్దె చెల్లించకుంటే ఎలా: లావణ్య, ఎంపీపీ

ఎంపీడీవో కార్యాలయానికి అద్దె చెల్లించకుంటే ఎలా నిర్వహించేది. కనీస వసతుల కల్పనకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. తాగునీరు సైతం కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ వెంటనే స్పందించి అద్దె బకాయిలు, కార్యాలయ నిర్వహణ ఖర్చుల బిల్లులు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed