హతవిధీ..! జీజీహెచ్‌లో కుష్టు వ్యాధిగ్రస్తులపై అంత నిర్లక్ష్యమా

by Shiva |
హతవిధీ..! జీజీహెచ్‌లో కుష్టు వ్యాధిగ్రస్తులపై అంత నిర్లక్ష్యమా
X

దిశ, నిజామాబాద్ సిటీ: కుష్టు వ్యాధిగ్రస్తులకు నిజామాబాద్ జిజిహెచ్ భోజన ఏజెన్సీ మూలంగా ప్రతి రోజు వారు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ భయంకరమైన వ్యాధితో వారి చేతి వేళ్లు, కాళ్లు పూర్తి‌గా పోయాయి. కనీసం రోజువారీ కార్యక్రమాలు తమరి తాము చేసుకోలేని పరిస్థితి వారిది. కనీసం భోజనం కూడా చేతితో తినాల్సిన పరిస్థితి కూడా లేదు. అయితే జీజీహెచ్‌లో వ్యాధికై చికిత్స కోసం వచ్చే వారికి భోజనం ఏజెన్సీ నిర్వాహకులు నరకం చూపిస్తున్నారు. సమాజం వారిని వెలివేసినప్పటికీ ఆసుపత్రిలోనైనా తమకు కనీస సదుపాయాలు అందుతాయని జిల్లా ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా ఘోర అవమానం ఎదురవుతోంది.

కుష్టి వ్యాధిగ్రస్తులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వారి కోసం ప్రత్యేకమైన వసతులు మధ్యాహ్న భోజనం‌తో పాటు పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ, భోజన ఏజెన్సీలు మాత్రం వారికి ఏవీ అందించడం లేదు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా ఓ వార్డును కేటాయిస్తారు. అ వార్డులోకి ఆసుపత్రి సిబ్బంది ఇతరులు వారికి ఏం కావాలన్నా దగ్గరికి వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. కానీ, జీజీహెచ్ భోజన ఏజెన్సీ నిర్వాహకులు అశ్రద్ధ మూలంగా వారు నిత్యం నరకం చూస్తున్నారు. ఆ ప్రత్యేక వార్డులో ప్రతిరోజు ఐదు నుంచి పదిమంది వ్యాధిగ్రస్తులు ఉంటారు. అయితే, వారి వద్దకు వెళ్లి భోజనం అల్పాహారం అందించాల్సిన భోజనం ఏజెన్సీ నిర్వాహకులు గత కొన్నేళ్లుగా వారి వద్దకు ఆహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

దీంతో చేసేది ఏమీ లేక వారిలో ఒకరు ప్రతిరోజు జీజీహెచ్‌లో ఉన్న క్యాంటీన్ వద్దకు క్యాన్లతో వెళ్లి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రుళ్లు ఆహారం తెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడే ఉంది అసలు సమస్య వేడి వేడి పాత్రలతో ఉండే ఆహార పదార్థాలు వారికి కనీసం చేతుల్లో పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండే చేతులతోనే అతి కష్టంతో తీసుకెళ్తున్నారు. అలా ఎందుకు తీసుకువస్తున్నారని అడుగుతే ఏజెన్సీ నిర్వాహకులు పేపర్ ప్లేట్లలో తమకు ఆహారాన్ని అందిస్తున్నారని సమాధానం ఇచ్చారు. అయితే ప్రతి సంవత్సరం కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం అంటూ ప్రచారాలు చేసే ఆసుపత్రి సిబ్బంది అధికారులు వీరి పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని ఆసుపత్రికి వచ్చిన రోగులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed