ముఖ్యనాయకుల జూమ్ సమావేశంలో ఎంపీ అర్వింద్..

by Sumithra |
ముఖ్యనాయకుల జూమ్ సమావేశంలో ఎంపీ అర్వింద్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం కోనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లర్లు, సోసైటిల మిలఖాత్ ఐ రైతులను కడ్తా (తరుగు) పేరుతో దోచుకునేందుకు యత్నిస్తారని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయకుండా కొనుగోలు చేసేలా పోరాటం చేయాలని ఎంపీ ధర్మపూరి అర్వింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఏర్పాటుచేసిన జూమ్ సమావేశంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో క్వింటాలుకు 6 నుండి 8 కిలోలు తరుగు తీస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. రెండు రోజుల క్రితం మోర్తాడ్ సొసైటీ పరిధిలో జరిగిన ఘటన పై ఆరా తీశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో 40,000 ఎకరాలకు పైగా మామిడి, నువ్వులు, జామ, వరి పంటలు దెబ్బతిన్నాయని, నియోజకవర్గ ముఖ్యనాయకులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా నిలబడాలన్నారు.

ఒకవైపు సొసైటీ కేంద్రాలలో తరుగు తియ్యట్లేదని, కానీ రైస్ మిల్లులలో తరుగు తీస్తున్నారని, ఇలాంటి దొంగ వ్యవహారాలు నడుస్తున్నాయని, వీటిపై కొట్లాడాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మక్కలను ఎమ్మెస్పీ ధరకు అమ్ముకోలేక, దళారులకు అమ్మి నష్టాల పాలవుతున్నారన్నారు. రైతుల సమస్యలన్నిటి పై పోరాడుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అంతే కాకుండా పార్లమెంట్ పరిధిలో బూత్ సశక్తీ కరణ్ పై రివ్యూ నిర్వహించి, మిగిలిన పోలింగ్ బూత్ లలో తక్షణమే పూర్తి చేసి రాష్ట్ర పార్టీకి అందజేయాలన్నారు. ఈ జూమ్ సమావేశంలో జిల్లాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, నియోజకవర్గ నాయకులు, పార్లమెంట్ కన్వీనర్, కో కన్వీనర్, పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed