Collector : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

by Kalyani |
Collector : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి బోర్గాం (పి) శివారులోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

సర్వే నెంబర్లు, ఫ్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే, వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పాదదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed