54 మంది బాలకార్మికులకు విముక్తి

by Naveena |
54 మంది బాలకార్మికులకు విముక్తి
X

దిశ, కామారెడ్డి : జిల్లాలో ఆపరేషన్ స్మైల్-11 ద్వారా 54 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-11వ విడతలో జిల్లా వ్యాప్తంగా 54 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ లేబర్, ఎన్జీవోస్, అధికారులతో టీం ఏర్పాటు చేసి జిల్లా అంతటా పర్యటిస్తూ..54 మంది బాలకార్మికులను గుర్తించినట్లు తెలిపారు.

ఇందులో 45 మంది మగ పిల్లలు, తొమ్మిది బాలికలు ఉన్నారని తెలిపారు. ఈ 46 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని, ముగ్గురిని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ చేర్పించామని, మరో ముగ్గురిని చిల్డ్రన్ హోమ్ కు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 18 మంది తో పని చేయించుకుంటున్న యజమానులకు జరిమానా విధించినట్లు తెలిపారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.


Next Story

Most Viewed