Collector : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చొరవ చూపాలి

by Kalyani |
Collector : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చొరవ చూపాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ పంట రుణాల మాఫీ కింద లబ్ది చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, రుణమాఫీ జరగని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పాలనాధికారి అన్ని మండలాల తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. పంట రుణాల మాఫీ, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - 2025 కార్యక్రమాల నిర్వహణ పై దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల్లో రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేసిన కలెక్టర్, ఇంకా ఎక్కడైనా వివిధ సాంకేతిక కారణాలతో అర్హులైన వారికి రుణ మాఫీ జరగని పక్షంలో అందుకు గల కారణాలను పరిశీలించాలన్నారు. రుణమాఫీ కి సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. పంట రుణమాఫీ విషయమై సంప్రదించే రైతుల పట్ల సానుకూల ధోరణి తో వ్యవహరించాలన్నారు. ఎక్కడ కూడా అధికారులు స్పందించడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదన్నారు. ముఖ్యంగా ఏఓ లు, ఏఈఓ లు రైతులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్య పరిష్కారానికి శాయశక్తులా కృషి చేయాలని హితవు పలికారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ -2025 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి బిఎల్ఓ లు ఇంటింటి సర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేను పకడ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్లకు సూచించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ - 2024 ఓటరు జాబితా ప్రకారంగా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు బిఎల్ఓ లకు పూర్తి అవగాహన కల్పిస్తూ శిక్షణ అందించాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి వలస వెళ్ళారా? మృతి చెందారా? పేర్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఫోటో స్పష్టంగా ఉందా అనే అంశాలను బిఎల్ఓ లు పరిశీలించాలన్నారు. ఒకే ఇంట్లో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లయితే సర్వే సందర్భంగా ప్రత్యేక పరిశీలన జరపాలన్నారు.

ఎస్ఎస్ఆర్ - 2025 రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఈ ఓటరు జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే జరపాలని హితవు పలికారు. రాష్ట్ర స్థాయి అధికారుల బృందం సైతం పరిశీలన కోసం వస్తుందని, సర్వేకు సంబంధించిన అన్ని వివరాలను సక్రమంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నిర్ణీత గడువుకు ముందే ఇంటింటి సర్వేను పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలో ప్రతి ఇంటికి సందర్శించిన తేదీని పొందుపరుస్తూ, ఎస్ఎస్ఆర్-2025 అని మార్కింగ్ చేయాలని ఆదేశించారు.

ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలన్నారు. ఓటరు జాబితా సవరణ అంశాలపై ప్రతి బుధవారం ఈఆర్ఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించాలని సూచించారు. కాగా, ధరణి పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed