MLA : అధికారులే మీ దగ్గరకొస్తే.. మీరు రోడ్లెక్కుడెందుకు?

by Kalyani |
MLA : అధికారులే మీ దగ్గరకొస్తే.. మీరు రోడ్లెక్కుడెందుకు?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఇంకా ఎవరెవరికి రుణమాఫీ జరగలేదో, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ రుణమాఫీ జరుగుతుందని ఆయన అన్నారు. రుణమాఫీ జరగని రైతుల వివరాలు తెలుసుకుని, వారి సమస్యలు పరిష్కరించి, రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు మీ దగ్గరకు వస్తుంటే, మీరు రోడ్లెక్కి ఇబ్బందులు పడుతూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో కొద్దిరోజులుగా అక్కడక్కడా రుణమాఫీ జరగని రైతులు బ్యాంకుల ఎదుట, రోడ్ల పైన ధర్నాలు చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ నెల 24న రైతు రుణమాఫీ విషయమే పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుండడంపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రైతు ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగే ఏ ఒక్క పనిచేయదని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో సాంకేతికపరంగా ఇబ్బందులు కలిగి చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించని విషయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందని ఆయన అన్నారు. సాంకేతికపరమైన తప్పిదాలు సరి చేశాక అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో రైతు రుణమాఫీ చేయడం చేతకాని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రుణమాఫీ కానీ రైతులు నేరుగా మీమీ గ్రామాల్లోకి వస్తున్న నోడల్ ఆఫీసర్లకు మీ సమస్యను వివరించి దరఖాస్తులు సమర్పిస్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారమై రుణమాఫీ వర్తిస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన తీరును ఓర్వలేని బీఆర్ఎస్, బిజెపిలు రెచ్చగొట్టే విధానాలకు మోసపోయి బలి కావద్దని సుదర్శన్ రెడ్డి జిల్లా ప్రజలకు, రైతాంగానికి సూచించారు. భార్యకు రుణమాఫీ అయితే భర్తకు రుణమాఫీ కావడంలేదని, ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణాలు ఉంటే అధికారులు రుణమాఫీ చేయడం లేదని పలువురు బాధితులు తమ దృష్టికి తెచ్చారన్నారు.

ఒక కుటుంబంలో ఎందరి పేరున రుణాలు ఉన్న అందరికీ కలిపి రూ. 2 లక్షల లోపు రుణాలను కచ్చితంగా మాఫీ చేయడం జరుగుతుందని ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ జరుగుతుందన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించిన పదేళ్లలో రైతుకు ఒరగ బెట్టిందేమీ లేదని, ఇప్పుడు తాము నిజాయితీగా చేస్తుంటే చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న తీరు బీఆర్ఎస్ నాయకుల కుసంస్కారానికి నిదర్శనమని ఆయన అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు జరిగిన ప్రయోజనమేమి లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్, మెడికల్ కాలేజ్, జిల్లా జనరల్ హాస్పిటల్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేశామని సుదర్శన్ రెడ్డి అన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రైతు రుణమాఫీ జరుగుతుందనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన అన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. విపక్ష పార్టీల మాటలు అసలే నమ్మవద్దని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని రైతులు గ్రహించాలని సుదర్శన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ డిసిసి ప్రెసిడెంట్ గడుగు గంగాధర్, సీనియర్ నాయకుడు రత్నాకర్, నగేష్ రెడ్డి, మార చంద్రమోహన్, ముప్పగంగారెడ్డి, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story