నాలుగు నెలల్లోనే అంతా తలకిందులు

by Sridhar Babu |
నాలుగు నెలల్లోనే అంతా తలకిందులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఆదరించిన ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీకి ఢోకా లేదని భావించిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు స్థానిక ఓటర్లు షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు వేరు , పార్లమెంట్ ఎన్నికలు వేరు అని చెప్పకనే చెప్పారు. అంతేగాకుండా ఉద్దండులు లీడర్లుగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా వారి పార్టీ బరిలో ఉన్నప్పటికీ వారికి ఓట్లు వేయించడంలో లీడర్లు విఫలమయ్యారు. మొత్తమ్మీద నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో మూడు బీఆర్ఎస్ కు, రెండు కాంగ్రెస్, రెండు బీజేపీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం మిశ్రమ తీర్పును ఇచ్చారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ గెలుపును అడ్డుకోలేరనే ధీమాతో ఉండగా ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు డిపాజిట్ మాత్రం దక్కేలా ఓట్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండే స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సొంత నియోజకవర్గమైన జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డిపై గెలిచిన ధర్మపురి అరవింద్ కన్నా మెజార్టీ ఓట్లను సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధర్మపురి అరవింద్ కు అర్బన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలిచిన బీజేపీకి ఇక్కడ రెండవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ధర్మపురి అరవింద్ లక్ష పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచినప్పటికీ నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల్లో వచ్చిన బంపర్ ఓట్లతోనే గట్టెక్కినట్లయింది. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం ప్రతీ రౌండ్ లో మూడంకెల ఓట్లను సాధించడానికి ఆపసోపాలు పడ్డారు. చివరకు చావుతప్పి కన్నులొట్టబోయినట్లు దరవాత్తును మాత్రమే దక్కించుకున్నారు. మొదటి నుంచి తాను పార్లమెంట్ కు పోటీ చేయలేనని, వద్దు మొర్రోనని మొత్తుకున్నప్పటికీ కేసీఆర్ ఆ పార్టీ నాయకుల ఒత్తిడితో పార్లమెంట్ కు పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్దన్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడుగురు ఎమ్మెల్యేలు సిట్టింగ్ లు ఉండగా ఒక్క బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహస్తున్న రాకేష్ రెడ్డిలు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు దక్కించుకోవడంలో సఫలమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఫలితాలు అంతా తారుమారు కావడం మూడు పార్టీలకు షాక్ ఇచ్చాయి. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సైతం నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాల నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు రావడంతోనే మెజార్టీ తగ్గిందని చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed