మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపట్టాలి

by Sridhar Babu |
మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేపట్టాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు నీరు నిలువ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలు మురుగు కాలువల్లోకి చేరి, పూడికతీత వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. నిజామ్ కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్ లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు

సమీపంలో గల మురుగు కాల్వను, ఖిల్లా రోడ్ కు ఆనుకుని ఉన్న శ్రీనివాస్ కాలనీలోని డీ-54 కెనాల్ ను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగుకాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్తా, చెదారం తొలగింపజేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురియకముందే డీ-సిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్నచోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలుకాని చోట పారిశుధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు.

పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద పరిస్థితి తలెత్తిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఇంచార్జ్ ఈఈ ఆనంద్ సాగర్, డీఈ వాసుదేవ్, ఏఈలు ఇనాయత్, రవి తదితరులు ఉన్నారు.

శివాజీనగర్ పాఠశాలలో పనుల పరిశీలన

కాగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ఐదు తరగతుల వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నీటి వసతిని పెంపొందించేందుకు వీలుగా చేపడుతున్న పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మరో నాలుగు రోజులలో బడులు పున: ప్రారంభం కానున్న దృష్ట్యా పనులను వేగవంతంగా జరిపించాలని అధికారులను

ఆదేశించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి, యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలన్నారు. అనవసరమైన పనులను సైతం చేపట్టి నిధులను వృథా చేయరాదని, అలాంటి వాటికి బిల్లులు మంజూరు కావని స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణను చక్కగా శుభ్రం చేయించి విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడుకునేందుకు క్రీడా మైదానంగా వినియోగించాలని, దీనివల్ల పాములు, ఇతర విష పురుగుల బెడద కూడా నివారించబడుతుందని అన్నారు. కలెక్టర్ వెంట ఈఈ దేవిదాస్, ఏఈ ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed