కంపు నిధులు కాజేసిన కంత్రీ లీడర్లు…మెక్కిన నిధులను కక్కించిన ఎంపీడీఓ

by Kalyani |
కంపు నిధులు కాజేసిన కంత్రీ లీడర్లు…మెక్కిన నిధులను కక్కించిన ఎంపీడీఓ
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామపంచాయతీకి చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్ లిద్దరూ కుమ్మక్కై లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన మరుగుదొడ్ల నిధులు రూ.1.60 లక్షలు అడ్డదారిలో నొక్కేశారు. అది కూడా ఒక్కరోజులో తమ పదవీకాలం ముగుస్తుందనగా జనవరి 31, 2024 రోజు పంచాయతీ సెక్రెటరీకి కూడా తెలియకుండా చెక్ ద్వారా బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నారు. గ్రామ పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి రాగానే విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

భీంగల్ మండలం దేవక్కపేట గ్రామంలో ఐ.హెచ్.ఎల్ స్కీం కింద మరుగుదొడ్లు నిర్మించుకున్న 13 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు రూ. 1.60 లక్షలు జీపి ఖాతాలో జమయ్యాయి. ఆ నిధులను పంపిణీ చేయాల్సి ఉండగా, వాటిని నొక్కేసేయాలని సర్పంచ్, ఉపసర్పంచ్ లు ప్లాన్ చేశారు. స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ఉండటాన్ని అవకాశంగా మలుచుకున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఇద్దరికీ మరుగుదొడ్ల నిధులు కాజేయాలని కక్కుర్తి ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. తెల్లారితే సర్పంచ్ గిరీ, ఉప సర్పంచ్ గిరీ పోతది.. ఇద్దరం కాంప్రమైజ్ అయితే రూ. 1.60 లక్షల లాభం అనుకున్నారో ఏమో.. ఇద్దరి మధ్య ఉన్న భేషజాలు పక్కన పెట్టి కంపు పైసలు అదేనండీ.. మరుగుదొడ్ల నిధులు కాజేశారు. చెక్ బుక్ లేకపోయినా బ్యాంకుకు వెళ్లి కొత్త చెక్ బుక్ తీసుకుని మరీ డబ్బులు డ్రా చేసుకున్నారు.

తమ పదవీకాలంలో ఆఖరి రోజు కూడా రూ. 1.60 లక్షలు లాభం అని సంతోషపడ్డారు. పాలన స్పెషలాఫీసర్ల చేతిలోకి వెళ్ళగానే బండారం బయటపడింది. లబ్ధిదారులు కూడా ఎంపీడీఓ కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన ఎంపీడీఓ విచారణ చేయమని ఎంపీఓ కు పురమాయించారు. ఎంపీఓ గ్రామానికి వెళ్ళి దీనిపై విచారణ చేపట్టారు. లబ్ధిదారుల డబ్బులను తామే వాడుకున్నట్లు ఎంపీఓ విచారణలో తాజా మాజీ, సర్పంచ్, ఉప సర్పంచ్ లు ఒప్పుకున్నారు. మింగిన నిధులు కక్కాల్సిందేనని, వాడుకున్న మరుగుదొడ్ల నిధులు తిరిగి జీపీ ఖాతాలో జమచేయాలని, లేదంటే క్రిమినల్ కేసు నమోదు చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బయటపడదనుకున్న వీరి అవినీతి బాగోతం బహిర్గతమై పరువు ఎలాగూ పోయింది.. క్రిమినల్ కేసు కాకుండానైనా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నొక్కేసిన రూ.1.60 లక్షలు జీపీ ఖాతాలో జమ చేశారు. దీనిపై ఎంపీడీఓ సంతోష్ ను ఫోన్ లో సంప్రదించగా జరిగిన విషయాన్ని పూసగుచ్చారు. ముందుగా వారి నుంచి నిధులు రికవరీ చేయించాలని నోటీసులు జారీ చేశామన్నారు. మంగళవారం రూ.80 వేలు, బుధవారం రూ.80 వేలు తిరిగి వారి నుండి రికవరీ చేశామని ఎంపీడీఓ తెలిపారు. లబ్ధిదారులకు చెక్ లు పంపిణీ చేస్తామని, తాజా మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ లపై చర్యలుంటాయని ఎంపీడీఓ సంతోష్ ఆన్నారు.

Advertisement

Next Story

Most Viewed