- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాన్సువాడలో నలుగుతున్న నాలుగో సింహం
దిశ, బాన్సువాడ : కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ పోలీస్ అంటూ... పోలీస్ స్టోరీ సినిమాలో హీరో సాయికుమార్ డైలాగ్ చెప్పినట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయనుకుంటే పొరపాటే. విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. రాజకీయ ఒత్తిళ్లు శ్రుతి మించుతున్నాయి. ఫైరవీ చేస్తేనే పోస్టింగ్ అన్నట్టుంది వ్యవహరం. ప్రజా ప్రతినిధుల అనుగ్రహం ఉంటేనే బాధ్యతల్లో, లేదంటే బదిలేనన్నది బహిరంగ రహస్యమే. దీంతో కక్కలేని మింగలేని పరిస్థితుల్లోకి నాలుగో సింహం వెళ్ళిపోతుంది.
బాన్సువాడ డివిజన్ లో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు, ఇసుక కాంట్రక్టర్ల పెత్తనం పెరగడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. లక్ష్మి కటాక్షం ఉన్నా, కుర్చీ కటాక్షం వద్దనుకనే దుస్థితే సజీవ సాక్ష్యం. అణిగిమణిగి ఉంటే అందలం ఎక్కే అవకాశాలున్నా, అందినంత దండుకునే వసతులున్నా ఇక్కడకు రాలేని విచిత్ర పరిస్థితులే ఉదాహరణ.
బాన్సువాడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పరిధిలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, బీర్కూర్, నసురుల్లాబాద్, పిట్లం, బిచ్కుంద పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మూడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉంటాయి. వీరందరినీ డీఎస్పీ అజమాయిషీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం డీఎస్పీ పోస్టు ఖాళీతో, నడిపించే నాయకుడు కరవైనట్టుంది పరిస్థితి ఇక్కడ.
అక్కడక్కడ శాంతి భద్రతల వైఫల్యం కనిపిస్తుంది. బైక్ దొంగతనాలు, ఇళ్ళలో చోరీలకు, అసాంఘిక కార్యకలాపాలకు, ఆకతాయిల ఆగడాలకు బ్రేకులు పడటం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు వ్యవహరం శాఖకు తలనొప్పిగా మారింది. ఈ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఆరు ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. జీరో ఇసుక దందా జోరుగా సాగుతోంది. వందలాది అక్రమ మైనింగ్ లారీల రాకపోకలు ఉంటాయి. స్థానికంగా ఇసుక మాఫియా చెప్పిందే వేదం. చేసేదే చట్టం. అడ్డు చెప్పితే అంతే సంగతులు.
అధికారైన, నాయకుడైన, సామాన్యుడైన బెదరాల్సిందే. కిక్కురుమనకుండా పడి ఉండాల్సిందే. కాదంటే అధికారులకు బదిలీ వేటు తప్పదు. సామాన్యులకు షాక్ ఇస్తారు. ఆ కోవలోనే బీర్కూర్ ఎస్సై పోస్టు సంగతి ముగ్గురు బదిలీలు, ఆరుగురు ఇంచార్జీలు అన్నట్టుంది. ఇసుక క్వారీల అడ్డాఅయిన బిచ్కుంద పరిధిలో పోలీసు ఉద్యోగం పులి మీద స్వారీనే. ఇక్కడ ఏం జరిగినా కీలకమైన డీఎస్పీ పోస్టుపై ఒత్తిడి తప్పదు. జరిగిన సంఘటనలకు ఆయనే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధుల, ఉన్నతాధికారుల తలంటు కార్యక్రమం ఇక షరా మామూలే.
బీర్కూర్ పోలీస్ స్టేషన్ కు గత ఆరు నెలల్లో ముగ్గురు ఎస్సైలు మారారు. ఇసుక పంచాయితీలే దీనికి ప్రధాన కారణం. మైనింగ్ మాఫియా బెదిరింపులు, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు కూడా కారణమే. ఇక సివిల్ తగదాల్లో తల దూర్చడం సరాసరే. రాజకీయ చైతన్యమున్న ఈ ప్రాంతంలో, అధికారుల అత్యాశను శాపంగా చెప్పొచ్చు. నిక్కచ్చిగా పని చేయడం తప్పుగానే భావించేలా ఉందక్కడ.
అందువల్లే ఆరు నెలల్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్స్ కు బదిలీ వేటు తప్పలేదు. ఆరు నెలల కిందట వరకు సతీష్ వర్మ ఏడాది పాటు ఇక్కడ పని చేశారు. తర్వాత రాజేష్ రెండు నెలలు, మన్సూర్ ఖాన్ రెండు నెలలు, రాజారాం రెండు నెలలపాటు పని చేసి బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో ఒత్తిడులు తట్టుకోలేకే బదిలీ జరిగిందనేది జగమెరిగిన సత్యం. ప్రతి బదిలీ సందర్భంలోనూ ఇంచార్జీ ఎస్సైగా సీతారాములమ్మ కొనసాగుతున్నారు. ప్రస్తుతం జూలై 16నుంచి ఎస్సై పోస్ట్ ఖాళీతో, ఆమెనే ఇంచార్జీ ఎస్ఐగా సైతం ఉండటం విశేషం.
ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్టు బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ అరెస్ట్ బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి బదిలీకి కారణమైందని పోలీసు డిపార్ట్మెంట్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోలేదనే కోపమే కారణమని అంటున్నారు. ముఖ్య ప్రజా ప్రతినిధులే కన్నెర్ర చేశారని, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఏకంగా శాఖకు అటాచ్ మెంట్ చేసేశారని, అప్పటి వరకు లీడర్లు నిద్రపోలేదని వినిపిస్తోంది.
దీన్నిబట్టే స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రాబల్యం, అజమాయిషీ, జులుం ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. తాజాగా సీఐ పోస్టు భర్తీ అయిన డీఎస్పీ పోస్టు ఇంకా భర్తీ చేయలేదు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఇంకా బాన్సువాడ ఇంఛార్జి డీస్పిగా కొనసాగుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నందున గంజాయి, క్లోరోఫాం సంగ్లింగ్ జోరుగా సాగుతోంది.
నకిలీ నోట్ల చలామణి జాడలు ఉన్నాయి. దొంగతనాలు, హత్యలు, సివిల్ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పోలీసు డిప్యూటీ బాస్ భర్తీ అత్యవసరమే. ఫ్రెండ్లీ పోలీసు నినాదం ప్రజా ప్రతినిధులు పాటిస్తే బాగుంటుందని జనం మాట. ఇకనైనా మేల్కొని బాన్సువాడ డివిజన్ లో ప్రజా ప్రతినిధులు, పోలీసులు కలిసి, ఎలా పని చేస్తారో చూడాలి మరి.