రహస్య పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి

by Mahesh |   ( Updated:2024-08-20 04:49:04.0  )
రహస్య పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ఓ క్లబ్ కొనసాగుతోందని తెలిసింది. కమ్మర్ పల్లి బస్టాండ్ ప్రాంతంలోనే 44 వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ భవనంలో ఈ క్లబ్ కొనసాగుతోంది. పేకాటరాయుళ్లు తరచూ ఇక్కడి క్లబ్‌లో పెద్దఎత్తున పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి పక్కా సమాచారంతో క్లబ్ పై రైడ్ చేయడంతో క్లబ్ నిర్వహణ విషయం బయటకు పొక్కింది. మంచిర్యాల, బోధన్ , జగిత్యాల, బాన్సువాడ తదితర ప్రాంతాలకు చెందిన పేకాట రాయుళ్లు ఈ క్లబ్ కు తరచూ వస్తారని, లక్షల్లో లావాదేవీలు ఉంటాయని తెలిసింది. పోలీస్ స్టేషన్ కు ఎక్కువ దూరం కూడా లేని క్లబ్ ను నిర్వాహకులు ఏడాదికి పైగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోలీసులు ఇటు వైపు దృష్టి సారించలేదు.

అధికారులను ముడుపులతో మాయ చేసి టెన్షన్ లేకుండా నిర్వాహకులు పేకాట క్లబ్ ను నడుపుతున్నట్లు స్పష్టమైంది. కొద్ది రోజుల క్రితం కమ్మర్ పల్లి ఎస్‌ఐ‌గా వచ్చిన అనిల్ రెడ్డి.. తనకు అందిన పక్క సమాచారం మేరకు సోమవారం రాత్రి పేకాట క్లబ్‌పై తన సిబ్బందితో ఆకస్మిక రైడ్ నిర్వహించారు. పోలీసుల మెరుపు దాడిలో క్లబ్‌లోని సెటప్ చూసి పోలీసులే విస్తుపోయినట్లు తెలిసింది. చాలా కాలంగా రహస్యంగా నడుస్తున్న ఈ క్లబ్ గురించి మండల కేంద్రంలోని ప్రజలకు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు కూడా పెద్దగా సమాచారం లేదని, అత్యంత విశ్వనీయ వ్యక్తుల ద్వారానే రహస్యంగా పేకాట క్లబ్‌ను నిర్వహస్తున్నట్లు పోలీస్ రైడ్ జరిగాకే బయటి ప్రపంచానికి అర్థమైంది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాలకు చెందిన పలువురు పేకాట రాయుళ్లు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నారు.

కరెన్సీ కాయిన్స్‌తో ఆట..

ఈ క్లబ్‌లో పేకాట ఆడాలనుకునే వారు ముందుగా క్లబ్ నిర్వాహకులకు నగదు డబ్బులు చెల్లిస్తే అంతే మొత్తంలో కరెన్సీ కాయిన్స్ ఇస్తారు. పేకాటలో కరెన్సీ కాయిన్స్‌నే ఉపయోగించాల్సి ఉంటుంది. క్లబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్స్ పైన సౌకర్యవంతంగా కార్డ్స్ ఆడేందుకు అవకాశం కల్పించారు. మధ్యమధ్యలో పేకాట రాయుళ్లకు కావాల్సిన మందు, నంచుకోవడానికి వెజ్, నాన్ వెజ్ స్నాక్స్, భోజనం అన్నీ క్లబ్ నిర్వాహకులు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే నైట్ పడుకోడానికి కూడా ఏర్పాటు ఉన్నట్లు సమాచారం. క్లబ్ లో పొరపాటున కూడా గొడవ జరగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత కాలం బాహ్య ప్రపంచానికి తెలియకుండా క్లబ్ ను నడిపించినట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో 35 మంది..

పేకాట క్లబ్ పై రైడ్ చేసిన ఘటనలో 35 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.2.38 లక్షలు, 35 సెల్ ఫోన్లు, క్లబ్ లో డబ్బులను బదులుగా వాడే కరెన్సీ కాయిన్స్, నాలుగు కార్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కమ్మర్‌పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నాగపూర్ గ్రామానికి చెందిన నీలకంఠ అనే వ్యక్తి ప్రస్తుతం క్లబ్ నిర్వాహకుడిగా ఉన్నట్లు, మెట్‌పల్లి, ఏర్గట్ల గ్రామానికి చెందిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు ఎస్సై తెలిపారు. క్లబ్‌కు అసలు యజమాని ఎవరనేది తేలాల్సి ఉందని, ఆ కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోలీస్ రైడ్‌లో జగిత్యాల, కరీంనగర్, బాన్సువాడ, బోధన్, మెట్ పల్లి ప్రాంతాలకు చెందిన వారు పట్టు బడినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు, బైక్, నగదు, కాయిన్స్ కోర్టుకు సబ్మిట్ చేస్తామని, నిందితులను రిమాండ్ చేస్తామని ఎస్ ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

చట్టవ్యతిరేక పనులను సహించేది లేదు

పేకాట తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎస్ఐ స్పష్టం చేశారు. తప్పు చేయని వారు, అన్యాయంగా ఇతరులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా తమ వద్దకు రావచ్చని, ఫ్రెండ్లీ పోలీస్ పక్కాగా అమలవుతుందన్న భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story