చేనేతల ప్రతి సమస్యను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చుతాం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Sumithra |
చేనేతల ప్రతి సమస్యను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చుతాం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, భూదాన్ పోచంపల్లి : చేనేత పై తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చుతామని వాటి పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పట్టణంలో శుక్రవారం రాత్రి పోచంపల్లికి చేరుకుని భారీ బహిరంగసభ నిర్వహణ అనంతరం రాత్రి బసచేసిన ఆయన పట్టణ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత కార్మికుల సమస్యల దీక్షలో శనివారం చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు. దీక్షను ఉద్దేశించి సీఎల్పీ నేత మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగాలతో కోటి ఆశలతో పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు లేని చేనేత కార్మికుల కుటుంబాల వెలుగులు చూడాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు.

చేనేత కార్మికుల్ని ఆదుకోకపోతే అది సమాజానికే మాయని మచ్చగా మిగిలిపోతుందని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ చెబుతుండే వారని అందుకే చేనేత కార్మికులకు ఆయన ఎన్నో సంస్కరణలు చేసి పరిశ్రమను నిలబెట్టి మండల కేంద్రంలో హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేసి ఎందరికో ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన నిధులు కేటాయించక నిర్వహణ లోపం వల్ల చేనేత ఉపాధి పై గొడ్డలి పెట్టులా వేసి హ్యాండ్లూమ్ పార్కును మూసివేసారని తీవ్రంగా మండిపడ్డారు. రైతన్నను సకల సదుపాయాలతో ఎలా ఆదుకున్నామో అలాగే నేతన్నను కూడా అన్ని రకాలుగా సంక్షేమాన్ని కల్పిస్తూ అభివృద్ధిని అందిస్తూ వారి పురోగతికి బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమాజంలో చేనేత వృత్తి వ్యాపార కార్యకలాపాలుగా కాకుండా సమాజానికి అత్యవసరమయ్యే వృత్తిగా చేనేతవస్త్రాలు లేకపోతే మానవ మనుగడ సాధ్యం కాదనే విధంగా భావించి చేనేత పరిశ్రమపై, వస్త్రాలపై కేంద్రప్రభుత్వం వెంటనే జీఎస్టీని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మాట ఇచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనాభా దామాషా ప్రకారం బీసీ సబ్ ప్లాన్ కింద బడ్జెట్లో 50 శాతం నిధులను కేటాయించి అన్నివర్గాల బడుగు బలహీనర్గాల ప్రజలను సమన్యాయం చేయవచ్చని చేనేత కార్మికులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇస్తామని హామీ ఇచ్చారు.

అలాగే పెద్దఎత్తున కార్మికులకు అవకాశాలు పెరుగుతాయని ప్రపంచంతో పోటీ పడవచ్చని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని దాంతో మార్కెటింగ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా చేనేతకు ఒక ప్రత్యేకమైన కళగా గుర్తింపు సాధించవచ్చని, తద్వారా ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతూ విస్తృతంగా ఉపాధి దొరుకుతుందని, ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నూలుపై సబ్సిడీని సకాలంలో చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నూలుపై సబ్సిడీని ప్రతినెలకోసారి చెల్లించేటట్లుగా మేనిఫెస్టో తయారు చేస్తున్నారని హామీ ఇచ్చారు. కోరి పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం బ్రతకడానికి రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప మనం ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు.. మనం బ్రతకాలి పదిమందిని బ్రతికించాలనేదే కాంగ్రెస్ నినాదం అని, ఆత్మహత్యలు లేని చేనేత కుటుంబాలను చూడాలన్నదే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మొట్టమొదటి అంశమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

కేటీఆర్ కు సిరిసిల్ల మీద ఉన్న ప్రేమ పోచంపల్లి మీద లేదు : కుంభం

అన్నం పెట్టే రైతన్న దేశానికి ఎంత అవసరమో బట్టలు ఇచ్చే చేనేత కూడా అంతే అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సిరిసిల్ల జిల్లా మీద చూపించిన ప్రేమ పోచంపల్లి పట్టణ మీద ఎందుకు చూపించట్లేదు అనేదానికి సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా చేనేత రైతులకు రుణమాఫీ చేసిందో అలాగే నేతన్నులకు కూడా రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. జియో టాగ్ కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని పోచంపల్లిలోని హ్యాండ్లూమ్ పార్క్ ను మోడ్రన్ మోటర్నైజ్ చేసి వెంటనే ప్రారంభించి కార్మికులకు కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే మరణించిన 25 మంది కార్మికులకు ప్రభుత్వం తరఫున 15 మందికి మాత్రమే నష్టపరిహారం అందిందని మిగిలిన పదిమందికి నష్టపరిహారం అందలేదని ఆ కుటుంబాలకు సొంతంగా ఒక్కొక్కరికి రూ. 20వేలను ఇస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం సీఎల్పీ నేత చేనేత కార్మికుడు వేముల సత్యం ఇంటికి వెళ్లి చేనేత చీర వార్పును పరిశీలించి, పట్టుచీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకుని మగ్గం పై కూర్చుని చీర నేశారు. నేతన్న వద్ద పట్టుచీరలు కొనుగోలు చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్ మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రినర్సింహారెడ్డి, పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా కోఆర్డినేటర్ గుణిగంటి రమేష్ గౌడ్, టౌన్ కోర్ కమిటీ కన్వీనర్ భారత లవ కుమార్, కార్మిక సంఘం నాయకురాలు అధ్యక్షురాలు మెరుగు శశికళ, చేనేత జనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చింతకింది రమేష్, కర్నాటి పురుషోత్తం, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సూరేపల్లి రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed