నేడు మర్రిగూడ సహకార చైర్మన్ పై అవిశ్వాసం.. నెగ్గేనా వీగేనా ?

by Mahesh |
నేడు మర్రిగూడ సహకార చైర్మన్ పై అవిశ్వాసం.. నెగ్గేనా వీగేనా ?
X

దిశ, మర్రిగూడ: మర్రిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పందుల యాదయ్య పై నేడు అవిశ్వాసం పెట్టనున్నట్లు సీఈవో శ్రీనివాస్ తెలిపారు. గతంలో మెజార్టీ డైరెక్టర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. డిసిఓ రాజేందర్ రెడ్డి కి అవిశ్వాసం పై ఏడుగురు సభ్యులు సంతకాలు చేసి చేసిన కాపీని అందజేయగా మూడున అవిశ్వాసం తేదీని ప్రకటించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇటీవల ధాన్యం కొనుగోలులో రూ.45 లక్షలు అవినీతి చోటు చేసుకుందని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అవినీతిపై నిగ్గు తేల్చాలని రైతులు డైరెక్టర్లు ఆందోళన చేసిన విషయం పాఠకులకు విదితమే.

అవినీతిపై ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేసిన అధికారులు ఇన్చార్జి సాయికుమార్‌ను సస్పెండ్ చేస్తూ చైర్మన్ సీఈఓ‌లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. డీసీఓ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి విచారణ చేసి 45 మంది రైతుల దగ్గర వాంగ్మూలం సేకరించారు. సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై చైర్మన్ పట్టించుకోవడం లేదనే మెజార్టీ డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టి ఆయనను తొలగించాలని డిసిఓకు మెజార్టీ డైరెక్టర్లు సంతకాలతో కూడిన అవిశ్వాసం లెటర్‌ను అందజేశారు. సొసైటీలో మొత్తం చైర్మన్ తో కలిపి 13 మంది డైరెక్టర్లు ఉన్నారు.

చైర్మన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో మల్గిరెడ్డి అనంతరెడ్డి, బాయికాడి ఏడుకొండలు, మహేశ్వరం మారమ్మ, పగుడాల లింగయ్య, మామిడి యాదయ్య, చామకూర తేజశ్రీ , ఉప్పునూతల మల్లయ్యలు ఉన్నారు. అయితే అవిశ్వాసం జై కొట్టిన వారు స్థానికంగానే ఉండగా మిగతా వారిని తీసుకుని ప్రస్తుత చైర్మన్ యాదయ్య ఐదుగురు డైరెక్టర్లతో క్యాంపుకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే అవిశ్వాసం అనుకూలమా వ్యతిరేకమా అనే మీమాంస నెలకొంది. సహకార చైర్మన్ అవిశ్వాసంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. రేపటితో అవిశ్వాసానికి తెర పడనున్న 45 లక్షల రూపాయల కుంభకోణం పై రైతులు చేస్తున్న ఆందోళన మాత్రం కొనసాగేటట్లే కనిపిస్తుంది.



Next Story