- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టన్నెల్‌లోనే కార్మికులు.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్

దిశ,నాగార్జునసాగర్ : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ లో చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ పనులు జరుగుతున్న వేళ పైకప్పు కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సంఘటన జరిగి మూడు రోజులు కావొస్తున్నా కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువైపోయింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అడుగడుగునా రెస్క్యూ సిబ్బందికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్‌లో ప్రమాద స్థలానికి వెళ్తున్న క్రమంలో సీపేజ్ ఉబికి వస్తోంది. భూగర్భ జలం లీకేజీ వల్ల ఇబ్బందులు తప్పడంలేదు. భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్ చేస్తున్నారు. సీపేజ్ వల్ల రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతోంది. నీరు పెరగడం వల్ల లోకో మోటివ్‌గాని,మరే పరికరాన్ని కాని ప్రమాద స్థలానికి తీసుకెళ్లలేకపోతున్నారు. దీనివల్ల కార్మికులను వెలికి తీసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. ఇక బురద, నీరు వల్ల టీబీఎం దగ్గర అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద టీబీఎం దగ్గరకు చేరుకున్నా..అక్కడ అడుగు పెట్టాలంటేనే కఠినంగా పరిస్థితులున్నాయి. మట్టిలో కూరుకుపోతుండడం..నీళ్లు భారీగా చేరడం వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది.టన్నెల్ లో చిక్కుకున్న వారి పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఘటన స్థలం వద్ద నలుగురు మంత్రుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దేశంలోనే ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగమని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నామని తెలిపారు. వారి ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని, ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ, జీఎస్‌ఐ ఇలా 10 సంస్థలకు చెందిన నిపుణులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రేపు ఎన్‌జీఆర్‌ఐ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణులు రానున్నారని వెల్లడించారు. గంటకోసారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. సహాయ చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుజూపల్లి, కోమటిరెడ్డి పర్యవేక్షించారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు, ఆర్మీ, నేవీ, సింగరేణి, జేపీ, నవయుగకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడుసార్లు సొరంగంలో తనిఖీలు నిర్వహించాయి. 584 మంది నిపుణులు బృందాలుగా ఏర్పడి సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన రెస్క్యూ టీం కూడా సహాయ చర్యల్లో నిమగ్నమైంది. వీరితోపాటు 14 మంది ర్యాట్ హోల్ మైనర్స్ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషుల జాడను కనిపెట్టే స్నిప్పర్ డాగ్స్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాబిన్ టన్నెల్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్‌లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన క్రిస్ కూపర్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులతో ఉన్నత స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు.