ఆరు బయట నిద్రించే మహిళలే టార్గెట్

by Disha Web Desk 11 |
ఆరు బయట నిద్రించే మహిళలే టార్గెట్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : గత కొన్ని రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళల మెడలో బంగారు ఆభరణాలే టార్గెట్ గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతూ... పోలీసులకు సవాల్ గా మారిన గ్యాంగ్ ను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ చేసిన పలు నేరాలకు సంబంధించిన వివరాలను రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి శనివారం భువనగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియాకు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో పలు మండలాల్లో గుర్తు తెలియని ముఠా ఆరుబయట నిద్రించే మహిళలే టార్గెట్ గా వారి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. దీంతో సీపీ తరుణ్ జోషి పర్యవేక్షణలో యాదాద్రి జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జోన్ వ్యాప్తంగా పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలో ఆలేరు మండలం జీడికల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ఒక ముఠా దోపిడికి పాల్పడే క్రమంలో వారికి అదుపులోకి తీసుకొని విచారించారు.

విచారణలో తేలిన గగ్గురుపొడిచే విషయాలు.....

పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పొట్టేటి మరియా దాస్, ఆయన తమ్ముడు పొట్టెటి శంతయ్యలు 16 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వలస వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో మరియా దాస్ కు మోత్కురు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కర్నే లక్ష్మీ అనే వివాహితురాలితో నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం అయింది.

ఈ క్రమంలో లక్ష్మీ భర్త చనిపోగా అప్పటి నుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. అయితే మరియ దాసుకు రెండు కుటుంబాలను పోషించడం కష్టంగా మారడంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇతను మొదటగా 2019వ సంవత్సరంలో భువనగిరి పట్టణ పీఎస్ పరిధిలో దొంగతనానికి పాల్పడి 14 గొర్రెలను దొంగిలించాడు. ఆ తర్వాత 2023లో ఒంటరిగానే తుర్కపల్లి, భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డారు.

ఒంటరి నుంచి ముఠాగా మారి...

ఇలా ఒంటరిగా దొంగతనాలకు పాల్పడుతూ తర్వాత లక్ష్మీ, తమ్ముడు శాంతయ్య, మోట కొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన లక్ష్మీకి సోదరుడి వరుస అయ్యే బాణాల రాజేష్ లు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇక ఈ ముఠా 2023 నుంచి జిల్లాలోని ఆత్మకూర్, ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, భువనగిరి రూరల్, మోటకొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.

మొదట రెక్కి వేసి.....

ప్రధానంగా ఈ ముఠా ఆరు బయట నిద్రించే మహిళల మెడలో బంగారు ఆభరణాలే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు తమ మంగళ సూత్రాన్ని బంగారు చైన్ తో ధరించినప్పుడు మాత్రమే నిందితుడు మరియాదాసు అపహరిస్తాడు. దాంతో పాటు ఆ మహిళల మెడలో ఇతరత్రా బంగారు ఆభరణాలు ఉంటే వాటిని కూడా అదును చూసి అపహరిస్తాడు. ముందుగా నిందితులు దొంగతనానికి పాల్పడాలనుకునే ప్రదేశానికి వెళ్లి అక్కడ ప్రజలు రాత్రి సమయంలో భోజనం చేసి పడుకునే క్రమంలో రెక్కి నిర్వహిస్తారు.

ఆ ఇల్లు కూడా గ్రామంలో చివరగా ఉండే ఇళ్లుగాని, ఒంటరిగా ఉండే ఇండ్లను టార్గెట్ గా చేసుకుంటారు. ఆ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి దొంగతనం చేసిన తర్వాత ఎక్కడి నుంచి పారిపోవచ్చు, ఎక్కడి నుంచి త్వరగా బయటపడవచ్చని విషయాలను పూర్తిగా పరిశీలిస్తారు. మొదట మరియాదాసు దొంగతనానికి పాల్పడటానికి వెళ్లిన తర్వాత మిగతా ముగ్గురు నిందితులు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటూ పరిశీలిస్తుంటారు.

మరియాదాసు దొంగతనం చేసి బయటికి రాగానే లక్ష్మీని వెంటపెట్టుకొని పోలీసులకు అనుమానం రాకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 41 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ఒక ద్విచక్ర వాహనం, దోపిడీ ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సీపీ అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, యాదాద్రి ఏసీపీ రమేష్ కుమార్, యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు, తుర్కపల్లి ఎస్సై తక్యోద్దీన్, ఆలేరు ఎస్సై వెంకట శ్రీను, సిబ్బంది శ్రీనివాస్, ప్రదీప్ కుమార్, గిరి, రవి నాయక్, మల్లిక, హరీష్ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed