- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనగిరి కోట రూపురేఖలు మారుతాయి
దిశ, యాదాద్రి కలెక్టరేట్: భువనగిరి కోట రూపురేఖలు మారుతాయని, దశాబ్దపు కల నెరవేరబోతున్నదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం క్రింద భువనగిరి కోట మొదటి దశ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి కోట అభివృద్ధి పనులకు సంబంధించి దశాబ్దపు కల నెరవేరుతుందని, భువనగిరి కోట అభివృద్ధికి స్వదేశీ దర్శన్ 2.0 క్రింద కేంద్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు కేటాయిస్తూ మొదటి దశ పనులకు గాను రూ. 69 కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వీటిలో రోప్ వే, రోడ్లు, పార్కింగ్ వసతులు, ప్రారంభ ద్వారం, పర్యాటకులకు వసతులు, హరితవనాలు, విశ్రాంతి భవనాలు, సౌండ్ లైటింగ్, సాంకేతిక అభివృద్ధి తదితర పనులు ఉన్నాయని తెలిపారు. భువనగిరి పట్టణం హైదరాబాదుకు దగ్గరగా ఉన్నందున అభివృద్ధి పనులు ఎక్కువ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భువనగిరికి బస్వాపూర్ 6 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, అది కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, అలాగే పోచంపల్లి ప్రపంచ హెరిటేజ్ విలేజ్ గుర్తించబడిందని, దీనిని కూడా సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి పరచి పర్యాటకులను ఆకర్శించడం జరుగుతుందని తెలిపారు. బీబీనగర్ మండలంలోని మహదేవ్ పూర్ దేవాలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద చేపట్టి అభివృద్ధి చేయాల్సి ఉందని, సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ… స్వదేశీ దర్శన్ 2.0 పథకం క్రింద దేశంలో 53 పనులకు ఈరోజు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ప్రారంభించారని, ఇందులో భువనగిరి కోట అభివృద్ధి పనులు కూడా ఉన్నాయని అన్నారు.
అందులో భాగంగా భువనగిరి కోట మొదటి దశ అభివృద్ధి పనులను, ఏమేమి వసతులు కల్పించబడతాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించడం జరిగిందని, అలాగే జిల్లాలో యాదగిరిగుట్ట, కొలనుపాక, పోచంపల్లి తదితర పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతూ దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జడ్పిటిసి బీరుమల్లయ్య, అనూరాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ, కేంద్ర ప్రభుత్వ టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ మౌతోశ్ నాస్కర్, రాష్ట్ర టూరిజం జనరల్ మేనేజర్ ఎం.ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ నేత్ర, జిల్లా టూరిజం అధికారి ధనంజనేయులు, జిల్లా అధికారులు, హెరిటేజ్ సిబ్బంది కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, అంజయ్య, పర్యాటకులు, యువత పాల్గొన్నారు.