ఆ నియోజకవర్గంలో పోలీసుల రక్షణలో దోపిడి : MP Uttam Kumar Reddy

by Vinod kumar |   ( Updated:2022-09-02 11:01:43.0  )
ఆ నియోజకవర్గంలో పోలీసుల రక్షణలో దోపిడి : MP Uttam Kumar Reddy
X

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పోలీసుల రక్షణలో దోపిడి జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఎంపీ క్యాంపు ఆఫీస్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్‌లో రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై మున్సిపాలిటీ పరిధిలోని భూమిని వ్యవసాయ భూమిలా చూపి, కుంటల లెక్క ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని ఎంపీ ఉత్తమ్ ప్రశ్నించారు. ప్లాట్లు అమ్మడం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు గుర్తించాలన్నారు. కుంటలలో రిజిస్ట్రేషన్ల వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన 10 శాతం లేఅవుట్ భూమి నష్టపోతున్నామని చెప్పారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌లకి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. సాయిబాబా థియేటర్ రోడ్‌లో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న ల్యాండ్.. నేను దిగిపోగానే వివాదాస్పద భూమి కావడంలో ఆంతర్యమేమిటి..? అని ఉత్తమ్ ప్రశ్నించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే కు ఫేవర్ చేయడానికి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని పూర్తి చేయకుండా ఏటా కోటి రూపాయలు అద్దె చెల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీని వెనుక జిల్లా మంత్రి, కలెక్టర్ వాటా ఎంత ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రింద స్థానికంగా వేసిన విపిఆర్ వెంచర్‌లో మున్సిపాలిటీకి ఇచ్చిన లేఅవుట్ స్థల డాక్యుమెంట్లు మాయం చేసి.. ప్లాట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో ఖాళీ చేయించిన నేరేడుచర్ల ఎన్నెస్పీ స్థలం పై స్టే తీసుకొచ్చిన కుట్ర వెనుక ఉన్న ఎవరు ఉన్నారో ప్రజలు గుర్తించాలన్నారు. గిరిజనులకు చెందాల్సిన మఠంపల్లి మండలంలోని ఎంజి పవర్ ప్లాంట్ భూములను అధికార పార్టీ నాయకులు ఆక్రమించారని తెలిపారు. పట్టణంలోని పలు గణేషుని మండపాల వద్ద అన్నదాన కార్యక్రామాలు ప్రారంభించారు. ఈ సమావేశంలో రైల్వే బోర్డ్ మెంబర్ యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, తేజావత్ రాజా, కొణతం వెంకటరెడ్డి, బొల్లెద్దు ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story