తవ్విన కొద్దీ అక్రమ నిర్మాణాలే

by Sridhar Babu |   ( Updated:2024-08-28 14:15:54.0  )

దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భీమ సముద్రం ( చర్లపల్లి చెరువు) లో అక్రమ నిర్మాణాలు తవ్వి న కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఆక్రమణలు చూస్తే అధికారులు అందరికీ తెలిసి కూడా ఈ భవనాల నిర్మాణ సమయంలో కబ్జాదారులు ఇచ్చే మడుపులకు ఆశపడి నియంత్రించలేకపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చెరువు విస్తీర్ణం 1100 ఎకరాలు ఉన్నప్పటికీ అందులో 675 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం భూమి, మరో 425 ఎకరాలు పట్టాసికం భూమి.

ఆకాష్ కాలేజీ అక్రమణే ?

చెరువు భూమిలో 70 శాతం భూమిలో ఆకాష్ పాఠశాల, జూనియర్ కాలేజీ నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. చెరువు భూమిలో ఎఫ్టీఎల్ హద్దు తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్ హద్దు దిమ్మె ను సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడి వరకు పట్టా భూముల అయినప్పటికీ వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి తప్ప కట్టడాలు నిర్మించొద్ధు. కానీ అక్కడున్న ఓ ప్రైవేట్ పాఠశాల కాలేజీ హద్దులు నిర్మాణం చేసింది.అంతేకాకుండా కాలేజీ హాస్టల్ కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్, వంటశాల కూడా పూర్తిగా చెరువు భూమిలోనే నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. కాలేజీ భవనం, డైనింగ్ హాల్, విద్యార్థులకు క్రీడాస్థలం కోసం ఆక్రమించిన స్థలం చెరువులోనిదే. దాదాపు నాలుగు ఎకరాలకు పైగా భూమి పాఠశాల, కళాశాల ఆక్రమణంలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

డిఫెన్స్ అకాడమీ కూడా....

ఆకాష్ కళాశాలకు పక్కనే ఓ డిఫెన్స్ అకాడమీ భవన నిర్మాణం జరుగుతుంది. ఆ భవనం ముందు సుమారు ఎకరం పైగా భూమిని భవన యజమానులు ఆక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చెరువు భూమిలోనే విద్యార్థుల శరీర దారుఢ్యం నిర్వహించే శిక్షణ మైదాన స్థలమంతా చెరువు భూమిలోనే ఉంది. భవనం ముందు ఉన్న ఎఫ్ టీ ఎల్ హద్దురాళ్లను తీసి మరోచోట నాటారని సమాచారం. అయినప్పటికీ హద్దురాళ్ల అవతలికి భవన యజమాని ప్రహరీ గోడ నిర్మించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

అధికారులకు తెలిసినప్పటికీ...

చెరువు భూమిలోనే భవనాల నిర్మాణం జరుగుతుందన్న విషయం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ ఎక్కడా నియంత్రణ ప్రయత్నాలు జరగలేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అధికారులు అక్రమ కట్టడాలను చూసి చూడనట్లు వదిలేశారనే వినికిడి. అందుకే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలను కూల్చివేసి ఆ స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవడానికి హైడ్రా లాంటి చట్టం జిల్లా కేంద్రాలకు రావాలని ఒత్తిడి ప్రభుత్వం పై రోజురోజుకు పెరుగుతుంది.

Advertisement

Next Story