కబ్జా కోరల్లో మోదుగుల కుంట.. రూ.వంద కోట్ల భూమి అన్యాక్రాంతం

by Shiva |
కబ్జా కోరల్లో మోదుగుల కుంట.. రూ.వంద కోట్ల భూమి అన్యాక్రాంతం
X

దిశ, నల్లగొండ: నల్లగొండ నడిబొడ్డున ఉన్న వసుంధర కాలనీ, డాన్‌బొస్కో స్కూల్ వెనుక వైపు ఉన్న మోదుగుల కుంట (మొగుళ్ల కుంట) సర్వే నెంబర్ 436లో 42 ఎకరాల 8 గుంటల భూమి, సర్వే నెంబర్ 434లోని 5 ఎకరాల మేర భూమి ఉంది. 1966 మొదటి రికార్డుల్లో అలా భూ వివరాలు నమోదు చేసిన ఉన్నా.. నేటి రికార్డుల్లో ఆ భూమిని 4 గుంటలుగా కూడా చూపించడం లేదు. ఆ భూమి అంత నల్లగొండ బడాబాబుల చెరలోకి వెళ్లిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 2020లో సర్వే నెం.436 ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. అందులో ఎవరూ భూమి కొనుగోలు చేయకూడదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు మున్సిపల్ శాఖ నోటుసులు కూడా పంపంది. అయినా, కానీ ఆ భూమి హద్దుల వివరాలు నేటికి వెల్లడించ లేదు.

బడాబాబుల చెరలో మోదుగుల కుంట

మోదుగుల కుంట ఇప్పడున్న పరిస్థితి చూస్తే ఔరా అనాల్సిందే. ఎందుకంటే కుంటలోనే ఓ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే హద్దు రాళ్లను కూడా నాటారు. ఆ భూమి పూర్తిగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నా కొందరు బడాబాబులు, రియాల్టర్లు రాజకీయ నాయకులు ప్రోద్బలంతో ఏకంగా వెంచర్లు ఏర్పాటు చేసి వారి పేరు మీద భూమిని తర్జుమా చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ కుంట నల్లగొండలోని బ్రహంగారి గుట్ట నుంచి మొదలుకుని వసుంధర కాలనీ, డాన్‌బొస్కో స్కూల్ వైపుగా వచ్చే వరద నీటిని అక్కలాయిగూడెం వైపుగా వెళ్లకుండా అడ్డుగా ఉంటుంది. నీటిని నిల్వ చేసే వనరుగా ఉన్న కుంటను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. ప్రస్తుతం ఆ భూమి విలువు బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

నిద్రావస్థలో అధికారులు

ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నగరంలో హైడ్రా పేరుతో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములు, చెరువుల, కుంటలను కబ్జా కోరుల నుంచి కాపాడుతోంది. కానీ, భూ కబ్జాల విషయంలో మాత్రం నల్లగొండ‌లోని ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తమకే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎలాంటి హద్దులు నాటకపోవడం వల్ల ఇరిగేషన్ శాఖ వైఫల్యం స్పష్టం కనిపిస్తోంది. అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించిన మ్యాప్ రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడం అక్కడ వెంచర్ ఏర్పాటుకు అలాగే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వెనుక రూ.కోట్లు అధికారులకు ముడుపులు అందాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారులపై బలపడుతున్న అనుమానాలు..

భూ కబ్జా వ్యవహారంలో అధికారులకు భారీగానే ముడుపులు అందాయి అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. గత నెలలో చర్లపల్లి‌లోని భీమా సముద్రం కబ్జాకు గురైన విషయం ఆధారాలతో సహా ‘దిశ’లో ప్రచురితమైంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తం అయినట్లుగా, ఏదో సర్వే చేసినట్లు యంత్రాంగం అక్కడికి చేరుకుని చేరుకుని హంగామా చేశారు. కానీ, ఇప్పటికీ సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed