కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. త్వరలో బీఆర్ఎస్‌లోకి కుంభం..!

by Mahesh |
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. త్వరలో బీఆర్ఎస్‌లోకి కుంభం..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుంది. యాదాద్రిభువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి త్వరలోనే గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి భువనగిరి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో క్రేజ్ విపరీతంగా ఉంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు కలుపుకుంటూ పోవడంలో సఫలీకృతమయ్యారు. నియోజకవర్గంలో పాదయాత్రను సైతం నిర్వహించి ప్రజల్లో తనదైన ముద్రను వేశారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవడం పట్ల రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

భువనగిరి ఎంపీ టికెట్ ఆఫర్..

2014 ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తూ వచ్చారు. కానీ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో భువనగిరి ఎంపీ అభ్యర్థి స్థానం ఖాళీ అయింది. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సరైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని పార్టీలోకి లాగితే.. భువనగిరి అసెంబ్లీ స్థానంతో పాటు ఎంపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవచ్చనే ప్లాన్‌తో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. అయితే కుంభం అనిల్‌కు భువనగిరి ఎంపీ స్థానాన్ని పార్టీ అధిష్టానం ఆఫర్ చేస్తున్నట్టుగా సమాచారం. అనిల్ కుమార్ మాత్రం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ కీలక నేతలతో మంతనాలు పూర్తయాయ్యని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసంతృప్తులకు చెక్..

యాదాద్రిభువనగిరి జిల్లాలో కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు ఫైనాన్షియల్‌గా బలంగా ఉండడం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో స్థానికంగా పొలిటికల్ సర్కిల్ విస్తృతంగా ఉండటం ఆయన కలిసివస్తుందనే చెప్పాలి. అయితే నిజానికి యాదాద్రిభువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్నాయి.

కానీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఆ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తి స్వరం బలంగా వినిపిస్తోంది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడం.. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడం ఇటీవల ఎక్కువైంది. దీంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికతో అలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు అధిష్టానం ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు..

యాదాద్రిభువనగిరి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఇప్పటికే సత్సంబంధాలు కలిగి ఉండడం గమనార్హం. ఇదిలావుంటే.. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీరిద్దరూ బెంగళూరులో కనీసం వారంలో రెండు మూడు సార్లు కలుసుకుంటారనే ప్రచారం స్థానికంగా ఉంది.

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కీలక నేతలంతా రెడ్డి సామాజిక వర్గం వారు కావడం.. ఆయన చేరికకు అదనపు మైలేజ్ అవ్వనుంది. నిజంగా కుంభం అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే.. పార్టీలోని రెబల్ నేతలకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి నిజంగా కుంభం బీఆర్ఎస్‌లో చేరతారా..? ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారా..? లేదా మరేదైనా ఆశిస్తారా..? అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed