కేటీఆర్‌ను సీఎం చేయడం కోసం కేసీఆర్ పోరాటం, రాహుల్ ని ప్రధాని చేయడం కోసం సోనియా ఆరాటం : మంత్రి అమిత్ షా

by Naresh |   ( Updated:2023-10-27 14:48:24.0  )
కేటీఆర్‌ను సీఎం చేయడం కోసం కేసీఆర్ పోరాటం,                      రాహుల్ ని ప్రధాని చేయడం కోసం సోనియా ఆరాటం : మంత్రి అమిత్ షా
X

దిశ, సూర్యాపేట: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బహుజన వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంను చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ప్రజల మద్దతుతోనే దేశ సమగ్రాభివృద్ధిని బీజేపీ సాధ్యం చేస్తుందన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కుటుంబ పాలన కొనసాగించాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు.అందుకోసమే కాంగ్రెస్ పక్షాన రాహుల్ ని ప్రధాని చేయడం కోసం సోనియా ఆరాటం పడితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ ని సీఎం చేయాలని కేసీఆర్ పోరాటం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేటలో జరిగిన బీజేపీ జన గర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సొంత కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కృషి చేస్తున్నాయని, రాష్ట్రం, దేశంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ పేదలకు, దళితులకు, బీసీలకు వ్యతిరేక పార్టీ అన్నారు. దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడైనా, ఈసారైనా దళితుడిని సీఎం చేస్తారా అని సవాల్ విసిరారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది, ఎటు పోయింది కేసీఆర్ అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం 50 వేల కోట్లలతో అభివృద్ధి చేస్తానన్న మాటలు ఏమయ్యాయి అని అమిత్ షా ప్రశ్నించారు. బీసీల సంక్షేమం కోసం పదివేల కోట్లు ఖర్చు చేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.



ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే బీసీలను సీఎం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సమ్మక్క, సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి మోడీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్ర జలవివాదాన్ని పరిష్కరించామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి ఏడాదికి ఆరువేల రూపాయల చొప్పున 40 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి మోడీకి చెందుతుందన్నారు.

జనవరిలో రామ మందిరం నిర్మాణం, పూజ ప్రారంభం..

550 సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదంను పరిష్కరించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని, 2024 జనవరి చివరిలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి గాను పూజా కార్యక్రమం ప్రధాని మోడీ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి సూర్యాపేట నుంచి ప్రజలు తరలిరావాలని అమిత్ షా కోరారు. రామ మందిరం నిర్మించాలా, వద్దా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. రామ మందిరం నిర్మించాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు. బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల అందరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ బోర నర్సయ్య గౌడ్, కిషోర్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, నివేదిత రెడ్డి, హుస్సేన్ నాయక్, భాగ్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





Advertisement

Next Story