ధాన్యం కొనుగోలు పై ఆంక్షలు : ఆందోళనలో రైతులు, లారీ డ్రైవర్లు

by Sumithra |
ధాన్యం కొనుగోలు పై ఆంక్షలు : ఆందోళనలో రైతులు, లారీ డ్రైవర్లు
X

దిశ, మిర్యాలగూడ : ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం కొనుగోలు పై నల్గొండ జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించడంతో ధాన్యం సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏపీ సహా ఇతర జిల్లాల నుంచి మిల్లర్లు తక్కువ ధరకి ధాన్యం కొనడాన్ని ఇక్కడి రైతులు వ్యతిరేకస్తున్నారు. రైతులు ఆగ్రహానికి గురి కాకుండా జిల్లా కలెక్టర్ వాడపల్లి, ఆలగడపల వద్ద బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ధాన్యం రాకుండా కట్టడి చేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం లారీలను మిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు అధికారులు అనుమతించడం లేదు. అయితే విషయం తెలియని రైతులు, లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద ఇతర జిల్లాలకు చెందిన వందకు పైగా ధాన్యం లారీలను మిర్యాలగూడ వైపునకు రానివ్వకుండా పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు అడ్డుకున్నారు. దీంతో శనివారం రాత్రి నుంచి టోల్గేట్ వద్ద డ్రైవర్లు పడిగాపులు గాస్తున్నారు. ముందస్తు సమాచారం లేక వచ్చామని, లారీలలో పచ్చిధాన్యం మిల్లుకు చేర్చక పొతే కుళ్లి పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్క జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను అడ్డగించడం ఎంతవరకు సమంజసమని చెక్ పోస్ట్ ఉద్యోగులను ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం మిల్లులకు తరలించేలా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed