పల్లెల్లో గంజాయి కల్చర్.. యాదాద్రి జిల్లాలో యువత ఆగం

by Shiva |
పల్లెల్లో గంజాయి కల్చర్.. యాదాద్రి జిల్లాలో యువత ఆగం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాలో గంజాయి మత్తు పల్లెలను కమ్మేస్తోంది. అభం శుభం తెలియని యువకులు, విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని యువత గంజాయిని ఎక్కువగా సేవిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కళాశాల దశలోనే మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇప్పుడు పల్లెలకు విస్తరించి యువతకు సులువుగా లభిస్తుంది. గంజాయి మత్తు గ్రామాల్లోని యువతను పెడుదారుల్లో పడేలా చేస్తుంది. దీంతో పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతూ రోడ్డున పడేలా చేస్తుంది. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా ఫలితం లేకుండాపోతోంది.

గ్రామాల్లో ఇలా..

పట్టణాలలో ఉన్న గంజాయి కల్చర్ పల్లెకు కూడ చేరింది. దీంతో యువత మత్తును ఒక ఫ్యాషన్‌, ట్రెండ్‌గా భావిస్తున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గంలో భారీగా గంజాయి చేతులు మార్చుతూ చీకటి వ్యాపారాన్ని కొనగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎంత నిఘా పెట్టినా వారిని దాటుకుని మరీ వెళ్లి టార్గెట్స్ పూర్తి చేస్తూ యువతను మత్తుకు బానిసలను చేస్తూ పక్కదారి పట్టిస్తుండడం గమనార్హం. అయితే, గంజాయిపై నియంత్రణ చేపట్టాల్సిన ఎక్సైజ్ యంత్రాంగం ఆ స్థాయిలో పని చేయకపోవడం వలన గంజాయి విచ్చలవిడితనానికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని ప్రజలు భావిస్తున్నారు. అప్పుడప్పుడు ఎక్కడ ఒక దగ్గర దాడులు నిర్వహించి గంజాయిని పట్టుకున్న కూడా వాటి మూలాలను చేరించకపోవడంతో ఈ గంజాయి రవాణా ఏమాత్రం ఆగడం లేదు.

మండల కేంద్రాల్లో సైతం..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ పిల్లలు గంజాయి బారిన పడవుతుండడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గంజాయి నియంత్రణలో సంబంధిత శాఖ అధికారులు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే దీని వాడకం తగ్గుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నామమాత్రపు దాడులతో కాకుండా.. జిల్లాకు వచ్చే గంజాయి మూలాలను సేకరించినట్లయితేనే దీని నిర్మూలన సాధ్యమవుతుందని భావిస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండు నెలల్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి‌. అక్రమదారులపై కేసులు పెట్టినా మార్పు రాకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మత్తు మహమ్మారితో రోజురోజుకూ యువత జీవితాలు అంధకారం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక నిఘాను ముమ్మరం చేసి మత్తు పదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గల్లీకి ఒక బెల్టు షాపు..

గంజాయితో యువకులు మత్తులో తేలుతుంటే మరోవైపు జిల్లాలో బెల్ట్‌షాపులు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనీసం నాలుగుపైనే నడుస్తున్నాయి. జిల్లా కేంద్రం, మండల కేంద్రాలలో సైతం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. వైన్స్‌ల నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి బెల్ట్ షాపు నిర్వాహకులు తీసుకు వెళుతున్న వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాలలో గల్లీకో బెల్ట్ షాపు నడుస్తున్న సంబంధిత ఎక్సైజ్ శాఖకు మాత్రం అవి కనబడకపోవడం వెనక అంతర్యం ఏమిటోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవనగిరి జిల్లా కేంద్రంలో పాటు ప్రతి మండల కేంద్రంలోని హోటళ్లు, దాబాల్లో, వరంగల్ హైవేలోని బీబీనగర్, కొండమడుగు, భువనగిరి జిల్లా కేంద్రంలోని కొన్ని ధాబాలు, వంగపల్లి, ఆలేరులోని హోటళ్లు, దాబాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం సిట్టింగ్ నడుస్తోంది. ఇంత యథేచ్ఛగా నడుస్తున్నా కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటో మరి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed