- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డిజిటల్ అరెస్ట్..బీ కేర్ ఫుల్.. డబ్బులు పంపాలని డిమాండ్

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పది రోజుల క్రితం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని "రాయిగిరికి చెందిన ఒక వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మీ నాన్నను గంజాయి కేసులో అరెస్టు చేశాం... వెంటనే చెప్పిన నెంబర్ కు డబ్బు పంపించకపోతే జైలుకు పంపాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు." వెంటనే ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
"బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తికి సైతం వాట్సాప్ కాల్ వచ్చింది. నీ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్టు చేశాం.. ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్తున్నాం... అలా వద్దనుకుంటే చెప్పిన నెంబర్ల్ కు ఆన్ లైన్ లో డబ్బులు పంపమని డిమాండ్ చేశారు. దీంతో ఆ తండ్రి తన కొడుకుకు ఏమవుతుందా అని ఆందోళనకు గురయ్యాడు"...
ఇలా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేశాం వారిని జైలుకు పంపిస్తామని లేదంటే మేము చెప్పినంత డబ్బును ఆన్ లైన్ లో పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పలువురికి ఇటీవల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో వారికి సంబంధించిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొందరు భయపడి డబ్బులు సమర్పించుకుంటుంటే...మరికొందరు తమకు తెలిసిన వారితో ఈ విషయాన్ని చెప్పుకొని సైబర్ నేరం గా భావించి ఊపిరి పీల్చు కుంటున్నారు.
"డిజిటల్ అరెస్ట్" పదమే లేదు...
పోలీస్ శాఖలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే వినియోగంలో లేదు. ఈ విషయం తెలియక చాలామంది ఆందోళనకు గురవుతూ సైబర్ క్రైమ్ లకు గురి అవుతున్నారు. ఇదే విషయమై పోలీస్ శాఖ సైతం సోషల్ మీడియా ద్వారా జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేసి అరెస్టు చేశామంటే అసలు నమ్మద్దని పోలీసులు చెబుతున్నారు.
పలు రకాలుగా మోసాలు...
కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటారు. మీ పేరుతో విదేశాల్లో ఉన్న మీ బంధువులు, కుటుంబీకుల నుంచి పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని, ఆయుధాలు ఉన్నాయని నకిలీ పాస్ పోర్టులను గుర్తించామంటారు. దీనికి సంబంధించి ఢిల్లీ, ముంబై క్రైమ్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఐఆర్ నమోదయిందని చెబుతారు.
-మనీ లాండరింగ్, మీ బ్యాంకు ఖాతా నుంచి పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని, మీ ఫోన్ నంబరు అనేక మోసపూరిత ఖాతాలతో అనుసంధానమైందని చెబుతారు. దీనిపై ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మీతో మాట్లాడతారంటారు.
- మీరు ఫోన్‌లో చూడకూడని కంటెంట్ చూస్తున్నారంటూ బెదిరించి సొమ్ములు దోచుకునేవారూ ఉన్నారు.
ఇవి మాత్రం చెప్పొద్దు...
-పిన్, ఓటీపీ అడిగితే చెప్పొద్దు/పంపొద్దు..సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు.సైబర్ మోసగాళ్లు తరచూ ప్రజలకు, వినియోగదారులకు తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను ఇస్తారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఎల్లప్పుడూ సదరు బ్యాంకు, లేదా ప్రభుత్వ శాఖ, సంస్థలు, కంపెనీల అధికారిక, వెబ్‌సైట్లనే సంప్రదించాలి.
పోలీసుల సూచనలు...
-ఇలాంటి ఫోన్లు వస్తే ధైర్యంగా మాట్లాడాలి. మనం భయానికి లొంగామా వారి పని సులువవుతుంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దు. పదే పదే చేస్తుంటే ఆ నంబర్లను బ్లాక్ చేయాలి.
-ఫోన్ చేసి మిమ్మల్ని నమ్మించేందుకు మీ వ్యక్తిగత వివరాలు చాలానే చెబుతారు. వాటికి స్పందించ వద్దు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి. నగదు బదిలీ చేయవద్దు. వీలైతే వీడియో కాల్‌లో వ్యక్తిని స్క్రీన్‌షాట్ తీయండి, లేదా కాల్‌ను రికార్డు చేయండి. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు చేసి ఫిర్యాదు చేయండి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు ఇవ్వచ్చు.
పోలీసులు ఎవరు వీడియో కాల్ చేయరు : చంద్రబాబు, సీఐ, భువనగిరి రూరల్
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్లు ఫోన్ చేసి మీ పిల్లలపై కేసుందని డిజిటల్ అరెస్ట్ చేస్తామనేటప్పుడు సమీపంలో పోలీసులను సంప్రదించండి. ఆన్‌లైన్‌లో పోలీసులు అరెస్ట్ చేయడం జరగదు. నిజంగా కేసులుంటే ముందుగా నోటీసులు జారీ చేస్తాం. పోలీసులు ఎవరూ వీడియోకాల్ చేసి కేసుల నుంచి తప్పిస్తామని చెప్పి డబ్బులు అడగరు. అలా అడిగితే ప్రజలు ధైర్యంగా వారి వివరాలు ఆరా తీయండి. ఒకవేళ నగదు బదిలీ చేస్తే.. వెంటనే సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వండి. మీరు పంపించిన ఖాతాను ఫ్రీజ్ చేయించండి. ముందు తల్లిదండ్రులకు.. పిల్లలపై నమ్మకం ఉండాలి. ఇటువంటి మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి.