- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో శనిలా దాపురించిన లీడర్లు.. ఆ ఫలాలు ప్రజలకు దక్కనీయకుండా కుట్ర!
మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టుల కింద భూమలన్నీ కొందరు నాయకులు, వారి బినామీలవే.. కాంట్రాక్టర్లవి కూడా.. ప్రాజెక్టులు వస్తన్నట్టు ముందుగానే తెలుసుకున్న లీడర్లు చక్రం తిప్పారు. ఫ్లోరైడ్ బూచిగా చూపుతూ అగ్గువ ధరకు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ప్రధానంగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి.
దిశ, తెలంగాణ బ్యూరో/నల్లగొండ జిల్లా ప్రతినిధి: మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, లక్ష్మణాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నది. కానీ వాటి ఫలాలను మాత్రం పీడిత ప్రజలకు అందకుండా లీడర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు, వారి బినామీలు శనిలా దాపురించారు. ప్రాజెక్టు రాకముందే భూ సేకరణ చేస్తారంటూ అగ్గువ ధరకే హస్తగతం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్లోరైడ్ ప్రాంతంగా ముద్ర వేసి ఎకరం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే కాజేశారు. ప్రభుత్వం సేకరిస్తే ఆ మొత్తం కూడా రాదన్న భయంతో అనేక మంది రైతులు అమ్మేసుకున్నారు. కేంద్రం కృష్ణా జలాల వాటా తేల్చితే, నీళ్లు వస్తే.. ఫలితాలు మాత్రం పెద్దలకే ఎక్కువగా దక్కుతాయంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల కింది గ్రామాల్లోనే వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు అధికంగా జరిగాయి. ప్రతి లావాదేవీ వెనుక లీడర్లు, వారి అనుచరులు, బినామీలే ఉన్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి రెడీగా పెట్టుకున్నారు. 2017 భూ రికార్డుల ప్రక్షాళనకు ముందే వ్యవహారాన్ని చక్కదిద్దుకున్నారు. ఆఖరికి అసైన్డ్ భూములను కూడా కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. కొందరు రైతులు నల్లగొండ జిల్లా కలెక్టరుకు కూడా కంప్లెయింట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ప్రధానంగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. తానేదార్ పల్లి, శివన్నగూడెం, రామిరెడ్డిపల్లి, నామాపురం, ఎస్.లింగోటం, వడ్డెపల్లి, తుంగపాడు, దామెర గ్రామాల్లో నేతలకు వందలాది ఎకరాలు ఉన్నాయని తెలిసింది. భూములన్నీ ఈ మూడేండ్ల కాలంలోనే కొనుగోలు చేయడం విశేషం. సాగునీటికి అవకాశం అధికంగా ఉన్న రెవెన్యూ గ్రామాల్లోని భూములపైనే నేతలు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా వివాదాస్పద భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లిచ్చినా ముందుగా అత్యధిక ఫలాలను అనుభవించేది నాయకులు, రిటైర్డ్ ఇంజినీర్లు, వారి బినామీలేనన్న చర్చ నడుస్తున్నది.
రిటైర్డ్ అధికారి, బినామీకి 150 ఎకరాలు
ప్రాజెక్టు ప్రారంభానికి ముందే ఏయే గ్రామాల్లో భూ సేకరణ చేస్తారు? ఏయే సర్వే నంబర్లలోని భూములను తీసుకుంటారు? ముందు ఏయే గ్రామాలకు సాగునీళ్లు అందుతాయని తెలిసిన కొందరు రిటైర్డ్ అధికారులు, నాయకులు వారి బినామీల పేరిట వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. శివన్నగూడెం, నామాపురం, రామిరెడ్డిపల్లి గ్రామాల్లో స్థానిక నాయకుల సహకారంతో ఓ రిటైర్డ్ ఇంజినీర్ తన బినామీల పేరిట ఏకంగా 150 ఎకరాలను కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయన ఎకరానికి రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో ఎకరం ధర రూ.50 లక్షల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఆయనకు ఎంత లాభం చేకూరిందో అంచనా వేయొచ్చు. ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా వంద ఎకరాలకు పైగానే కొనుగోలు చేశారని ప్రచారం. ఇక మండల స్థాయి నాయకులు కూడా పెద్ద ఎత్తునే కొన్నారు. అలాగే మిగతా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, మాజీలు, నాయకులు కలిసి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. 2016 నుంచి చోటు చేసుకున్న లావాదేవీలను పరిశీలిస్తే వాటి వెనుక ఎవరున్నారన్న విషయం తెలిసిపోతుంది. ఇంతకీ వందలాది ఎకరాలు కొనుగోలు చేసేందుకు వీరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న చర్చ ఇప్పటికీ సాగుతున్నది.
ప్లాట్ల భూములు మావే
సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో 1990–2000 మధ్యకాలంలోనే వందలాది ఎకరాల్లో వెంచర్లు వేసి అమ్మేశారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ హద్దురాళ్లు ఏర్పాటు చేయకుండానే పేపరు మీదనే చూపించి వినియోగదారులకు అంటగట్టారు. దాంతో తాము కొనుగోలు చేసిన ప్లాటు, స్థలం ఎక్కడ అనేది నిర్దిష్టంగా తెలియదు. దానికి తోడు వ్యవసాయ భూమిని యథాతథంగా వెంచర్లు చేశారు. నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్ డీడ్స్ చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటే కొనసాగుతున్నాయి. దాంతో భూ రికార్డుల ప్రక్షాళనలో మళ్లీ రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. ఇదే అదనుగా భావించిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఓ రాజ్యసభ సభ్యుడు వారి బినామీల పేరిట పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఎలాగూ ప్లాట్లు కనిపించకపోవడంతో వారి పని ఈజీగా మారింది. ఇప్పటికీ వారు సాగు భూములే ప్లాట్లుగా క్రయ విక్రయాలు సాగినట్లుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ చూసినా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నా తెలిసిపోతుంది. 20 ఏండ్ల క్రితమే ప్లాట్లుగా సేల్ డీడ్స్ అయ్యాయి. అవే భూములను వ్యవసాయ భూములుగా నేతలు కొనుగోలు చేశారు. ఇదంతా స్థానికులు గుర్తించినా వారిని ఎదిరించే ధైర్యం చేయడం లేదు. రెవెన్యూ రికార్డులను అడ్డం పెట్టుకొని ఎకరం రూ.50 లక్షల విలువైన భూములను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే దక్కించుకున్నారని ప్రచారం జరుగుతున్నది.
వివాదాల్లో నేతలు
కొత్త భూ వివాదాలను సృష్టించి ఊళ్లను రెండు వర్గాలుగా చీల్చిన ఉదంతాలున్నాయి. ఉదాహరణకు సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఓ ఊరిలో రైతు తన భూమికి ఫెన్సింగ్ వేసుకుంటుంటే అందులో ప్రభుత్వ భూమి ఉందంటూ పేచీ పెట్టారు. ఆఖరికి సర్వే చేసి అలాంటిదేం లేదని తేలినా ఫెన్సింగ్ వేయకుండా టీఆర్ఎస్ నాయకులు పెద్ద గొడవ చేశారు. తప్పని చెప్పాల్సిన మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో మరింతగా వివాదాన్ని పెంచారు. ఆఖరికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులను సదరు అధికార పార్టీ నాయకులు కల్పించారు. మరో ఊరిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు పట్టా భూమి నుంచే ఏకంగా రోడ్డేశారు. తన భూమి నుంచే రోడ్డేట్లా వేస్తారని ప్రశ్నించిన రైతుకు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒత్తిడి చేసి రోడ్డుకు పట్టా భూమిని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తున్నట్లు రాయించుకోవడం విశేషం. పలు గ్రామాల్లో నేతలు భూ వివాదాలు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటి వెనుక మాజీ ప్రజాప్రతినిధి ప్రోద్బలం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. భూములు కొనుగోలు చేసిన ఆర్ధిక లావాదేవీలు, సంపాదనపై దర్యాప్తు చేస్తే అంతులేని నిజాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు.
Also Read : మునుగోడులో లక్కీ హ్యాండ్‌కు బ్రేక్.. తెరపైకి కొత్తనేత పేరు!