గతంలో వడగండ్ల బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి

by Naresh |
గతంలో వడగండ్ల బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి
X

దిశ, రాజాపేట: భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో వడగళ్ల వానలు ఎక్కువ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పంట నష్టపరిహారంను ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్న బ్యాంకర్ల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాజాపేట రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. రైతులకు బ్యాంకర్లు పంటల బీమా ప్రీమియం కట్టుకొని రుణాలు ఇస్తున్నారని, పంట నష్టపోయినప్పుడు బీమా చెల్లించడం లేదని అన్నారు. రైతులకు పంటల బీమా బ్యాంకర్లతో చెల్లించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులపై ఉందన్నారు. గతంలో ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి బొమ్మలరామారం, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో రైతులు వడగండ్ల వల్ల వేల ఎకరాల పంట నష్టం జరిగిందని మంత్రి చెప్పారు.

వారందరికీ పరిహారమందేలా చూడాలన్నారు. కేవలం ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో వడగండ్ల వానలు అధికంగా ఉంటాయని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. రాజాపేట రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాల పై అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ అవసరమైన సహాయాన్ని అధికారులు చేపట్టాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రైతు వేదికల లక్ష్యాలను నెరవేర్చే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. రైతులు నాటు వేసే సమయం నుండి కోత కోసి పంటను విక్రయించే వరకు అధికారులు రైతు వేదికల్లో అవసరమైన సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని, సంబంధిత అనుబంధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అండగా ఉండాలన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సరైన వర్షాలు లేని కారణంగా వచ్చే వేసవికాలంలో తాగు, సాగు నీటి ఎద్దడి రానుందని, అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

తాగునీటి కోసం బోర్లు వేయొద్దని ఉత్తర్వు విషయంలో తగు నిర్ణయాలు తీసుకొని అవసరమైతే కొత్త బోర్లను వేయాలన్నారు. జియాలజీ డిపార్ట్మెంట్ అధికారుల సలహాలు సూచనలతో ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదికలు రైతుల ప్రయోజనం కోసం కొనసాగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సెక్టార్ పరిధిలోని రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, మోటకొండూరు మండలాల వ్యవసాయ అధికారులు ఏఈవోలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed