చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలి

by Sridhar Babu |
చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలి
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, భూమికోసం, భుక్తి కోసం పోరాటం చేసిన మహా నాయకురాలని కొనియాడారు. ప్రజలందరినీ ఐక్యం చేసి దొరలపై విజయం సాధించినట్టు తెలిపారు.

ఆమె పోరాటస్ఫూర్తిని నేటి తరం పునికిపుచ్చుకోవాలని సూచించారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోరాటాలకు నిలయమని, దొరల నియంతృత్వ పాలన అంతమొందించడానికి వీరులను కన్నతల్లి నల్లగొండ అని అన్నారు. రజాకారులకు, నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మనందరం ముందుకు సాగాలని కోరారు. గత పాలకులు చాకలి ఐలమ్మ పోరాటాన్ని మరిచారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోఠిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, టీఎన్జీవోస్ సెక్రటరీ దున్న శ్యామ్, సట్టు నాగయ్య, చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు బి. ఉపేందర్, రజక సంఘం అధ్యక్షులు గుండారపు శ్రీను, మాచర్ల అచ్చయ్య, రజక ఎంప్లాయీస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, రజక ఎంప్లాయీస్ జిల్లా ప్రెసిడెంట్ రావులకోటయ్య, ఏ.చంద్రయ్య, ఏ.పద్మ, కోడూరు నిర్మల, బుత్త రాజు శైలజ , జి. శివ, జె.సైదులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed