CCLA Naveen Mittal : పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

by Sumithra |
CCLA Naveen Mittal : పెండింగ్ ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
X

దిశ, నల్లగొండ : పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులన్నిటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్.ఏ నవీన్ మిట్టల్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో ధరణి పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం విషయమై గడిచిన రెండు నెలలు ఉన్నత స్థాయిలో 5 వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి పెండింగ్ దరఖాస్తులను ఒక కొలిక్కి తీసుకురావడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో గడిచిన నెలన్నర వ్యవధిలో 26,000 అప్లికేషన్లకు గాను, 19,000 కు పైగా దరఖాస్తులు పరిష్కరించి మంచి ప్రతిభ కనబరచ్చడటం పట్ల ఆయన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని తక్షణమే పరిష్కరించాలని, ఇందుకు తహశీల్దారులు సమయాన్ని నిర్దేశించుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాల తహశీల్దారులు ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు.

13 మండలాల్లో 90% కన్నా ఎక్కువగా దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, తక్కువ ఉన్న మండలాల తహశీల్దారులు సైతం ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. తహశీల్దార్లు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా దరఖాస్తుల పరిష్కారం పై దృష్టి సారించాలని, ఇక పై ఎప్పటి దరఖాస్తులు అప్పుడే పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని చెప్పారు. రీ సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) సేత్వార్ విస్తీర్ణంలో తేడాలను సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు కేసులు ఆర్ఎస్ఆర్ దాటి ఉన్నాయన్నారు. ధరణి స్పెషల్ డ్రైవ్ తర్వాత ఆర్ఎస్సార్ పరిశీలన జరిపి కేటగిరి వారిగా విభజించి వాటిని పరిష్కరించే ఏర్పాటు చేయాలన్నారు. అటవీ, రెవెన్యూ హద్దులు, వివాదాలకు సంబంధించి వివాదం ఉన్నచోట సంయుక్త సర్వే నిర్వహించాలని ఏలాంటి సమస్యలేనివి నిజమైన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ధరణి పార్ట్ - బిలో ఉన్న దరఖాస్తుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆర్ఎస్ ఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.

మండలానికి ఒక గ్రామాన్ని మోడల్ గా తీసుకొని తహశీల్దార్లు ఈ పని పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం వివరిస్తూ గడిచిన నెల రోజుల్లో వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మొత్తం 26 వేల దరఖాస్తులకు గాను, ప్రస్తుతం 7000 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, కొన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయాల్సిందన్నారు. సాధ్యమైనంత త్వరగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని, అలాగే ఇతర సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, సీసీఎల్ఏ రాష్ట్ర కార్యాలయాధికారి లచ్చిరెడ్డి, ధరణి రాష్ట్ర కమిటీ సభ్యులు భూమి సునీల్, డీఎఫ్ఓ రాజశేఖర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్ఓడీ రాజ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్డీవోలు రవి, శ్రీనివాసరావు, శ్రీరాములు, తహశీల్దార్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed