- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. బీఆర్ఎస్ ఎంపీ అసహనం

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో 8వ సారి జాతీయ బడ్జెట్(Union Badget)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ(Telangana)కు ప్రత్యేకంగా కేటాయింపులు లేకపోవడంతో ఎంపీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల 65వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా ఇందులో తెలంగాణకు ఒక పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని మరోసారి తీవ్ర నిరాశపర్చిందని అంటున్నారు.
ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర(MP Vadiraju Ravichandra) మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్(Bihar), ఢిల్లీ(Delhi) రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారని తెలిపారు. బీహార్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటును ప్రకటించి, తెలంగాణలోని మామూనూర్ పునరుద్ధరణ, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. వీటి విషయమై పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు(Ram Mohan Naidu)ను స్వయంగా కలిసి వినతిపత్రమిచ్చి కోరడం జరిగిందని గుర్తు చేశారు. అయినా కూడా ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం శోచనీయమని వద్దిరాజు రవిచంద్ర ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రస్తావనే లేకపోవడం దారుణమని వద్దిరాజు విమర్శించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM), మరికొన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లు, సైనిక్ స్కూల్స్, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ పాఠశాలల ఏర్పాటు ప్రస్తావనే లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చి మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించడం సంతోషకరమన్నారు. నిర్మలమ్మకు తెలంగాణతో సత్సంబంధాలు ఉండి కూడా బడ్జెట్‌లో ఈ విధంగా వివక్ష చూపడం తీవ్ర విచారకరమని ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు