- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP Chamala: నీకు తెల్వదు.. అప్పుడు జైల్లో బిజీ.. కవిత మాటలపై ఎంపీ చామల కౌంటర్

దిశ, డైనమిక్ బ్యూరో: ఫాంహౌజ్‌లో పడుకొని డిజైన్ చేయడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. “నీళ్లు - నిజాలు”పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. మీరు అరెస్ట్ అయి జైల్లో బిజీ ఉన్నప్పుడు.. పేపర్లు చదువకనో మీకు తెల్వనట్లుంది.. కాళేశ్వరం విచారణ ఘోష్ కమిటీ, ఇంజనీర్లు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు కాళేశ్వరం కూలిపోవడానికి వాస్తవాలు తెలిపాయని వివరించారు. రాజకీయం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం కవిత మాట్లాడుతున్నారని అన్నారు.
శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూరు, మానేరు లాంటి 1935 నుంచి 2004 దాకా కాంగ్రెస్ హయాంలో గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టులు ఏవీ కూలిపోలేదని తెలిపారు. కానీ మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఎందుకు కూలిపోయింది? అని ప్రశ్నించారు. రాజకీయం చేయడం కాదు.. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. నాడు పోతిరెడ్డి ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లు నాటి సీఎం జగన్ తీసుకుపోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాలను కాపాడుకునేందుకు దేనికైనా తెగిస్తాం.. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టకండని ఎంపీ చామల విమర్శించారు.
కాగా, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం “నీళ్లు - నిజాలు”పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీళ్ల మీద రేవంత్ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని, నీటి విషయంలో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని మండిపడ్డారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారని, బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి, కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు.