యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి: తమ్మినేని

by GSrikanth |   ( Updated:2023-02-27 15:26:06.0  )
యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి: తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో ర్యాగింగ్‌, సీనియర్ల వేధింపులు, పని ఒత్తిడి తధితర కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి విద్యా సంస్థలో కంప్లైంట్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులతో పాటు, సైక్రాటిస్ట్‌, సైకాలజిస్ట్‌లను కూడా భాగస్వాములను చేసి తరచుగా విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని, సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని తోటి విద్యార్థులు ఆమె ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 32 ర్యాగింగ్‌ కేసులు యూసీజీకి వచ్చినట్లు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖనే పేర్కొన్నదంటే ర్యాగింగ్‌ ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతుందని తమ్మినేని వివరించారు.

Also Read:

వేలేరు మండలంలో కేటీఆర్ సుడిగాలి ప‌ర్యటన.. రూ.150 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

Advertisement

Next Story