పులుల డేటా విడుదల చేయనున్న మోడీ..ప్రాజెక్టు టైగర్‌కు నేటితో 50 ఏళ్లు పూర్తి..

by Anjali |
పులుల డేటా విడుదల చేయనున్న మోడీ..ప్రాజెక్టు టైగర్‌కు నేటితో 50 ఏళ్లు పూర్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: క్షీణిస్తున్న పులుల సంఖ్యను, సంరక్షణను ప్రోత్సహించడానికి 1973 ఏప్రిల్ 1తేదీన ‘‘ప్రాజెక్ట్ టైగర్’’ ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఈ ప్రాజెక్టులో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. 75,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పులుల అభయారణ్యాల సంఖ్య ప్రస్తుతం 53 కు చేరుకుంది. మన దేశంలో సుమారు 3,000 పులులు ఉన్నాయి. ఇది ప్రపంచ అడవి పులుల జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ. ఈ సంఖ్య ప్రతి ఏడాదికి 6 శాతం చొప్పున పెరుగుతోంది.

గత 50 ఏళ్లలో ఈ లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించడంతో ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు(ఏప్రిల్9)న కర్ణాటకలోని మైసూరులోని పలు టైగర్ రిజర్వ్‌లను సందర్శించి.. పులుల తాజా గణాంకాలను కూడా రిలీజ్ చేయనున్నారు. బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌లకు వెళ్లనున్నారని. ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ పర్యటన దృష్ట్యా మైసూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 9 వరకు పులుల అభయారణ్యం సందర్శనపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.

వీవీఐపీ సందర్శన దృష్ట్యా 181వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు మూసివేసి, ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కాగా.. ఈ విషయంలో ప్రధాని కూడా శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్, చెన్నైల్లో కార్యక్రమాలు ముగించుకుని మైసూరు వచ్చాను. రేపు ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవానికి హాజరవుతాను’’ అని పేర్కొన్నారు. కాగా.. ఈ ఈవెంట్‌లో ‘అమృత్ కాల్’ సందర్భంగా పులుల సంరక్షణపై ప్రభుత్వ విజన్‌ను ప్రధాని మోడీ విడుదల చేస్తారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఏ)ను కూడా ప్రారంభించి... ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక నాణెంను కూడా విడుదల చేయనున్నారు.

అనంతరం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సంరక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఫ్రంట్ లైన్ ఫీల్డ్ సిబ్బంది, స్వయం సహాయక బృందాలతో ప్రధాని మోడీ సంభాషిస్తారు. చామరాజనగర్ జిల్లా సరిహద్దులో పొరుగున ఉన్న తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించి, అలాగే అక్కడి మావుట్లు, కవాడీలను కలవనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అలాగే మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యుయేషన్ ఎక్సర్ సైజ్ లో ఇటీవల ముగిసిన 5వ విడతలో అత్యధిక మార్కులు సాధించిన టైగర్ రిజర్వ్‌ల ఫీల్డ్ దర్శకులతో కూడా ప్రధాన మంత్రి సంభాషిస్తారు.

Advertisement

Next Story

Most Viewed