తెలంగాణ బీజేపీ నేతలతో మోదీ భేటీ.. ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా రిలీజ్

by Javid Pasha |   ( Updated:2023-10-20 16:48:26.0  )
తెలంగాణ బీజేపీ నేతలతో మోదీ భేటీ.. ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో జనసేనకు కొన్ని సీట్లు కేటాయించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. అలాగే తొలి జాబితాను ప్రకటించడంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో తొలి జాబితాలో 60 నుంచి 70 మంది పేర్లు ఉండనున్నట్లు సమాచారం.

అలాగే అభ్యర్థుల తుది జాబితాను కూడా అధిష్టానం ఖరారు చేయనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, డా.లక్ష్మణ్, డీకే అరుణ, ప్రకాష్ జవదేకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం, ప్రచార సరళిపై కూడా అధిష్టానం చర్చించనుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోండగా.. బీజేపీ ఇంకా మొదలుపెట్టలేదు. కేంద్ర మంత్రుల పర్యటనలు మినహా బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మిగతా పార్టీలకు పోటీ ప్రచారం నిర్వహించాలని బీజేపీ చూస్తోంది.

ఈ నెలలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ పర్యటనలు ఉండే అవకాశముంది. అలాగే పలువురు కేంద్రమంత్రులు కూడా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో.. ఆలోపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతోంది.

Advertisement

Next Story