జనగాం టికెట్ నాకే.. MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-10-02 14:42:20.0  )
జనగాం టికెట్ నాకే.. MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనగాం అసెంబ్లీ టికెట్ వందశాతం తనకే వస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధినేత అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్‌ను తనకు ప్రకటించిన తర్వాతనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తానని, మీడియా ముందు అన్ని వివరాలను వెల్లడిస్తానన్నారు. అదిపార్టీ అంతర్గత అంశం, అవసరం అయినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తానన్నారు. ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదన్నారు.

గాంధీ ఆశయాలను కేసీఆర్ ప్రభుత్వం కచ్చితంగా ఆచరిస్తున్నదన్నారు. గాంధీ స్ఫూర్తి మాదయితే గాడ్సే స్ఫూర్తితో బీజేపీ నేతలు వెళుతున్నారని, నకిలీ గాంధీలు కాంగ్రెస్‌లో ఉన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ లాంటి వ్యక్తి గల్లీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారని, ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు పారలేదని మోడీ నిస్సిగ్గుగా మాట్లాడారని ఇంత కన్నా అబద్దం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే లక్షల టన్నుల ధాన్యం ఎలా పండిందన్నారు. వరి విస్తీర్ణంలో రెండో స్థానానికి ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానానికి నీళ్లు ఇవ్వనిదే చేరామా అన్నారు. మోడీకి బీజేపీ నేతలు తప్పుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు.. కనీసం రేపు నిజామాబాద్‌లోనైనా స్క్రిప్ట్ సరి చేసి మాట్లాడండి అని సూచించారు.

తెలంగాణ రైతు బంధుకు.. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధికి పోలిక ఎక్కడ అన్నారు. రైతు బంధు ద్వారా ఇప్పటికే 75 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశామని, కిసాన్ సమ్మాన్ నిధితో కేంద్రం వేసింది 10 వేల కోట్లు మాత్రమేనని ఎద్దేశా చేశారు. అవినీతి గురించి మోడీ మాటలు వద్దు అని, అవినీతి చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు కేంద్రం జేబు సంస్థలు.. విచారణ చేసుకోవాలని సూచించారు. బీజేపీ వ్యాపారుల పార్టీని దుయ్యబట్టారు. బీజేపీ అంటే బిజినెస్ జనతా పార్టీ అని మండిపడ్డారు. పసుపు బోర్డుపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తుంటే ఇప్పుడు ఎన్నికల ముందు మోడీ ప్రకటన చేశారన్నారు.

గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడో ఇవ్వాల్సింది.. ఇప్పుడు ప్రకటించారని, యూనివర్సిటీకి కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని మోడీ అబద్దాలు మాట్లాడారని, ఆయన మాట్లాడింది తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. తెలంగాణ పట్ల, గిరిజనులపట్ల బీజేపీది కపట ప్రేమ.. బీఆర్ఎస్‌ది అసలైన ప్రేమ అన్నారు. గతంలో బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లు దక్కలేదని, ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందన్నారు. గాడ్సే వారసులు.. నకిలీ గాంధీలకు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్‌నే ప్రజలు నమ్ముతారన్నారు.

రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్, జోకర్ అని దుయ్యబట్టారు. టికెట్లు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో రేవంత్ ఓటుకు నోటు కేసు సైతం పెండింగ్‌లో ఉందన్నారు. అన్ని కేసులతోపాటే ఈ కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ కర్ణాటక మోడల్ ఫెయిల్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏ పథకమైనా చివరి దాకా అమలు కాదని చరిత్ర చెబుతోందని, కర్ణాటక ప్రస్తుతం కరువుతో అల్లాడుతోందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా బీఆర్ఎస్‌దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed