Kodandaram: రెవెన్యూ ఉద్యోగులకు అండగా నిలుస్తా

by Gantepaka Srikanth |
Kodandaram: రెవెన్యూ ఉద్యోగులకు అండగా నిలుస్తా
X

దిశ, రవీంద్రభారతి: సాప్ట్ వేర్‌ను అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం భూములను సంపాదించుకుందని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులను కూడా ధ్వంసం చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ వ్యవస్థ సైతం ధ్వంసం చేయబడిందన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటూ అన్ని రకాల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు ఆత్మీయ అభినందన సభ సోమవారం రవీంద్రభారతిలో జరిగింది. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, వివిధ ఉద్యోగ సంఘాలు నేతలు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి పెద్దలను గౌరవించడం అనేది మొదటి నుంచి ఉందన్నారు. నాడు నెహ్రూ, ఇందిరాగాంధీ నుంచి నేటి వరకు మేధావులకు పదవులు ఇవ్వడం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో అస్తవ్యస్తమైందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి ఆరోపించారు. ఈ సమయంలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర కీలకమన్నారు. అసాధ్యం అనుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ప్రొఫెసర్ కోదండరాంకు దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా చేయబడ్డ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయన భుజాలపైనే పెడుతున్నామన్నారు. అకారణంగా రెవెన్యూ వ్యవస్థ నుంచి బయటకు పంపించబడ్డ ఉద్యోగులను మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తెచ్చే బాధ్యతను కూడా ఆయన మీదనే ఉంచుతున్నామన్నారు. ప్రభుత్వ సేవలు అందరికీ అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం తెచ్చే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తేబోతుందన్నారు. ఇప్పటికే ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం అందుబాటులో ఉంచిందన్నారు. రెవెన్యూ శాఖకు పూర్వవైభవం ఇచ్చే విధంగా కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు విశేషంగా కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోదండరాం చట్టసభలో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అంటేనే భూమి అని భూమి అంటేనే తెలంగాణ అన్నారు. తెలంగాణ చరిత్ర భూ పోరాటాల చరిత్రేనన్నారు. రాష్ట్రంలో ఉన్న 120 భూ చట్టాలను ఏక చట్టంగా రూపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, భూమి సునీల్ కుమార్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, ప్రొఫెసర్ పాపిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అశ్వత్థామ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుమారస్వామిని, భూమన్న యాదవ్, కమలాకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధా. తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement

Next Story