అసెంబ్లీలో ఆయన విగ్రహం పెట్టండి.. స్పీకర్‌‌కు ఎమ్మెల్సీ కవిత స్పెషల్ రిక్వెస్ట్

by GSrikanth |
అసెంబ్లీలో ఆయన విగ్రహం పెట్టండి.. స్పీకర్‌‌కు ఎమ్మెల్సీ కవిత స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని తెలంగాణ శాసన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయం అన్నారు. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు అని కొనియాడారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే అన్నారు.

మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఫూలేను తన గురువుగా అంబేద్కర్ ప్రకటించుకున్నారని గుర్తుచేశారు. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభలలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశ్యంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం అన్నారు. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా.అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇది మనందరికీ గర్వ కారణం అన్నారు. సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం అన్నారు.

Advertisement

Next Story