- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ముగ్గురి ఫోన్లు ఒకే రోజు మారాయ్.. ఈడీ ఛార్జ్ షీట్‌లో సంచలన విషయాలు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొదటి నుంచీ ఫోన్ల మార్పిడి వ్యవహారం, అందులోని డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు కీలకమైన అంశంగా మారింది. ఈ కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్న మొత్తం 36 మంది 170 మొబైల్ ఫోన్లు మార్చారని, ఇందులో కొందరు కొన్నింటిని ధ్వంసం చేశారని, అందులోని ఆధారాలను మాయం చేశారని స్పెషల్ కోర్టుకు సమర్పించిన రెండు చార్జిషీట్‌లలో ఈడీ ఆరోపించింది.
అందులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం రెండు నెంబర్లను వాడుతూ పది ఫోన్లు మార్చారని పలువురు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రస్తావించింది. ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా ఆమె ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నది. గతంలో వాడిన ఫోన్లను సైతం అప్పజెప్పాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రకారం తొమ్మిది ఫోన్లను మంగళవారం విచారణకు తీసుకెళ్ళి అందజేశారు.
ఈడీ తన చార్జిషీట్‌లలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే కవిత, ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు, ఆమెకు సన్నిహితంగా ఉండే బోయిన్‌పల్లి అభిషేక్ ఒకే రోజున ఫోన్లు మార్చినట్లు తేలింది. 2021 సెప్టెంబరు 1వ తేదీన ముగ్గురూ కొత్త ఫోన్లను వాడినట్లు ఈడీ పేర్కొన్నది. దానికి నాలుగు రోజుల ముందే (ఆగస్టు 28, 2021) అరుణ్ రామచంద్రన్ పిళ్ళయ్ కూడా ఫోన్ మార్చారు. కల్వకుంట్ల కవిత గతేడాది ఆగస్టు (23న)లో ఒకే రోజున రెండు వేర్వేరు మొబైల్ నెంబర్లతో వాడే ఫోన్లను మార్చారు. సరిగ్గా అదే రోజున గోరంట్ల బుచ్చిబాబు కూడా మార్చారు. దానికి ముందు రోజే (2022 ఆగస్టు 22న) రామచంద్ర పిళ్లయ్ కూడా ఫోన్ మార్చారు. కవిత కూడా తన రెండో నెంబర్‌లో ఆగస్టు 22, 2022న ఫోన్ మార్చారు.
మరోవైపు 2021 డిసెంబరు చివరి వారంలో కవిత, అభిషేక్ ఒక రోజు వ్యవధిలోనే ఫోన్లు మార్చారు. 2021 క్రిస్మస్ రోజున (డిసెంబరు 25) కవిత కొత్త ఫోన్‌కు మారితే ఐదు రోజులకే (2021 డిసెంబరు 30) అభిషేక్ మార్చారు. దీనికి ఐదు రోజుల ముందు (2021 డిసెంబరు 20న) అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డి మార్చారు. గతేడాది ఆగస్టు నెలలో కవిత మొత్తం నాలుగు ఫోన్లను మార్చగా శరత్‌చంద్రారెడ్డి, బుచ్చిబాబు (మూడుసార్లు), బోయిన్‌పల్లి అభిషేక్ (రెండుసార్లు) కూడా మార్చారు. ఈ ముగ్గురూ కలిపి కేవలం గతేడాది ఆగస్టు నెలలోనే మొత్తం పది ఫోన్లను మార్చినట్లు ఈడీ చార్జిషీట్‌లో వెల్లడైంది.
ఈ ఫోన్లలోని డిజిటల్ ఎవిడెన్సులను మాయం చేసినట్లు ఆరోపిస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చాటింగ్ గురించా ఆరా తీస్తున్నది. వీటిని రికవరీ చేయగలిగితే వారి బ్యాంకు లావాదేవీలు, నగదు బదిలీ తదితరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నది.