MLC Counting: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

by Shiva |   ( Updated:2025-03-03 02:46:08.0  )
MLC Counting: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని పూర్తి చేశారు. నల్లగొండ (Nalgonda) కేంద్రంగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక కరీంనగర్ (Karimnagar) వేదికగా మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయెట్, టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అదేవిధంగా ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ఊపందుకోనుంది.

కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 70.42 శాతం పోలింగ్ నమోదు కాగా, 2,50,106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్స్ స్థానంలో 91.90 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్-నల్లగొండ -ఖమ్మం టీచర్స్ స్థానంలో 93.55 శాతం ఓటింగ్ నమోదైంది. కౌంటింగ్ కోసం 25 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉండనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండ్ సోమవారం రాత్రి బయటకు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ నెల 4న (రేపు) అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు పట్టభద్రుల స్థానం ట్రెండ్ రేపు సాయంత్రం వరకు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలో ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ (Andhra University Engineering College), ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ (CR Reddy College), గుంటూరు ఏసీ కాలేజీ (AC College)లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. 123 బ్యాలెట్ బాక్సులు ఉండగా.. అధికారులు 20 టేబుల్స్ సిద్ధం చేశారు. ఇక ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ గుంటూరు (Guntur)లోని ఏసీ కాలేజీలో జరగనుంది. ఈ మేరక అధికారులు మొత్తం 29 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరు (Eluru)లోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఇందు కోసం అధికారులు 28 టెబుల్స్ సిద్ధం చేశారు.



Next Story