BRS ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.. రోజూ వందల సంఖ్యలో సచివాలయానికి బాధితులు!

by GSrikanth |   ( Updated:2023-03-02 01:53:19.0  )
BRS ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.. రోజూ వందల సంఖ్యలో సచివాలయానికి బాధితులు!
X

ఎమ్మెల్యేల హంగు ఆర్భాటాల ఎఫెక్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులపై పడుతున్నది. గడువు తీరాక లబ్ధిదారులకు చెక్కులు అందిస్తుండడం సమస్యగా మారుతున్నది. తీసుకున్న చెక్కులు పట్టుకుని బాధితులు సెక్రటేరియట్‌కు క్యూ కడుతున్నారు. కొత్త డేట్ వేయించుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు. ఇక్కడే కొందరు బ్రోకర్లు ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చెక్కుపై కొత్త డేట్ వేయించుకునేందుకు ఎమ్మెల్యేల అనుచరులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన దరఖాస్తులను సీఎంవో ఆఫీసులోని ప్రత్యేక విభాగం ఎప్పటికిప్పుడూ తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉన్న అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది. వాటికి రెవెన్యూ శాఖ చెక్కులు తయారు చేసి, సంబంధిత ఎమ్మెల్యేల ఆఫీసులకు పంపుతున్నది. వాటిని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వకుండా మెజార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దే కొంత కాలం పెట్టుకుంటున్నారు. ఒకరిద్దరికి పంపిణీ చేయడం వల్ల పొలిటికల్ మైలేజ్ రాదని, వంద చెక్కులు వచ్చే వరకూ వెయిట్ చేయిస్తున్నారు. పెద్ద సంఖ్యలో చెక్కులు వచ్చిన తర్వాత లోకల్‌గా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. దీంతో చెక్కుల కాలపరిమితి తీరిపోతున్నది.

నిత్యం సెక్రటేరియట్ ముందు క్యూ

రెవెన్యూ శాఖ తయారు చేసిన చెక్కుల కాలపరిమతి కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఈలోపే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసి, సొమ్ము చేసుకోవాలి. కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు గడువు తీరిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో వారు చెక్కులపై కొత్త డేట్ వేయించుకునేందుకు సెక్రటేరియట్‌కు వస్తున్నారు. ఇలా నిత్యం సుమారు 200 మంది లబ్ధిదారులు వస్తున్నట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి.

పైరవీకారుల ఎంట్రీ

చెక్కులపై డేట్ మార్చేపని కోసం ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల్లో కొందరు పైరవీ కారులు తయారవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ జాబితాలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అనుచరులు ఉండగా, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యే ఆఫీస్ స్టాఫ్ ఉన్నట్టు సమాచారం. చెక్కులపై కొత్త డేట్ వేయించుకునేందుకు మారుమూల గ్రామాల నుంచి లబ్ధిదారులు సెక్రటేరియట్‌కు రావడం చాలా కష్టం. దీంతో వారు బ్రోకర్లు అడిగినంత సొమ్ము చెల్లిస్తున్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ 40 శాతానికి పరిమితం చేశారు. మళ్లీ అవుట్ డేటెడ్ చెక్కును యాక్టివ్ చేయించుకోడానికి నాలుగైదు వేల వరకు అదనంగా లబ్ధిదారులు ఖర్చు చేయాల్సి వస్తున్నది.

డైరెక్ట్ ఇవ్వడమే పరిష్కారం

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లబ్ధిదారులు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులు బాటు ఉండేది. వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల చిరునామాకు చెక్కులు పోస్టు ద్వారా పంపేది. ఈ పక్రియలో మధ్యవర్తుల ప్రమేయం చాలా తక్కువగా ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఎమ్మెల్యేల ద్వారానే అప్లయ్ చేయాలి. వారి ద్వారానే లబ్ధిదారులకు తిరిగి చెక్కుల పంపిణీ జరగాలని షరతు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు తమకు ఇష్టం ఉన్నప్పుడు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ లోపు వాటి గడువు తీరిపోతున్నది. అందుకని చెక్కులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేర్చే వెసులుబాటు కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story