- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీలో కుల వివక్ష.. సాయన్న అంత్యక్రియల్లో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు!
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. అధికారిక లాంఛనాలతో నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సాయన్న అభిమానులు ఆందోళన చేపట్టారు. దళితుడైన కారణంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటూ సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై భీం అంటూ నినదించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు సహా పలువురు నేతలు సర్దిచెప్పాలని ప్రయత్నించినా అభిమానులు వినలేదు. చివరకు సాయన్న కుటుంబసభ్యులు వారికి నచ్చజెప్పి అంత్యక్రియలు పూర్తి చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం సాదాసీదాగా ముగిశాయి. అధికారిక లాంఛనాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో సాయన్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఆయన అంత్యక్రియలు జరిగిపోయాయి. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ఐదుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మారేడ్‌పల్లి శ్మశానవాటిలో అంత్యక్రియలు జరిగే సమయంలో సాయన్న అనుచరులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆయన దళితుడైనందునే ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నదంటూ ఘాటుగానే స్పందించారు. అధికారిక లాంఛనాలతో ఎందుకు జరిపించడంలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయన్న మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, నివాసానికి వచ్చిన నివాళులర్పించిన సీఎం కేసీఆర్ చివరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించే విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదన్నది సాయన్న అభిమానుల నుంచి ఎదురైన ప్రశ్న.
అసెంబ్లీ స్పీకర్ సహా మంత్రులు, అధికార పార్టీ నేతలంతా వచ్చి నివాళుర్పించి వెళ్లినా అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించే విషయంపై సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదని, వివక్షతో వ్యవహరించారన్న అసంతృప్తి వారి నుంచి ఎదురైంది. ఒక దశలో ఈ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అధికార లాంఛనాలతో జరిపించనున్నట్టు ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పారు. అప్పటికే అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి తదితరులు అక్కడ ఆందోళన చేస్తున్న పార్టీ శ్రేణులకు, సాయన్న అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ మంత్రులిద్దరూ సాయన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచీ సన్నిహితంగా ఉన్న మిత్రులే. అయినా అభిమానులు సంతృప్తి చెందలేదు. చివరకు ఆ ఇద్దరి మంత్రుల చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారు శ్మశానవాటిక నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఒక దశలో అంత్యక్రియలు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయన్న ఆశలతో అభిమానులు వేచి చూశారు. కానీ ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయన్న నిర్వేదం అభిమానుల్లో వ్యక్తమైంది.
మాటలకే పరిమితం
అధికారిక లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తామన్న మాటలు అక్కడికే పరిమితమయ్యాయని, ఆచరణకు నోచుకోలేకలేకపోతున్నట్టు నిమిషాల వ్యవధిలోనే సాయన్న అభిమానులకు అర్థమైంది. పద్మారావుగౌడ్ చొరవ తర్వాత పోలీసులు అధికారులు సాయన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమించాల్సిందిగా సర్దిచెప్పాలని సూచించారు. అధికారిక లాంఛనాలకు ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, పోలీసు సిబ్బందిని, దానికి తగిన ప్రొసీజర్‌ను ఫాలో కావాల్సి ఉంటుందని, అందుకు సమయం పడుతుందని, అనుకున్న సమయానికి అంత్యక్రియలు జరగవని, ఆలస్యమవుతుందని సాయన్న కుటుంబ సభ్యులకు పోలీసులు వివరించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై కలెక్టర్ నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదంటూ సాయన్న కూతురుకు డీఎస్పీ వివరించారు. చివరకు సాయన్న కుటుంబ సభ్యులే చొరవ తీసుకుని ఆందోళన చేస్తున్న అభిమానులకు, పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి అధికారిక లాంఛనలు లేకుండా సాదాసీదాగానే అంత్యక్రియలు ముగించారు. దళితుడైనందునే ప్రభుత్వం వివక్షతో వ్యవహరించిందని అభిమానులు ఆరోపించారు. సినీ నటులకు కల్పించిన అధికారిక లాంఛనాలను సిట్టింగ్ ఎమ్మెల్యేకు కల్పించకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి కూడా అంత్యక్రియల విషయంలో గౌరవ మర్యాదలను కల్పించిన ప్రభుత్వం.. సొంత పార్టీ నేత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని విమర్శించారు. సొంత పార్టీ నేతలు, సాయన్న అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తం కావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. ఒకవైపు శ్మశానవాటికలో చితిపై సాయన్న మృతదేహం ఉండగానే ఈ ఆందోళనలు, నిరసనలు వ్యక్తం కావడంతో సాయన్నకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మైనంపల్లి హన్మంతరావు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
మంత్రుల నుంచి సమాధానం నిల్
అభిమానులు లేవనెత్తిన అంశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు గుక్కతిప్పుకోలేకపోయారు. సినీ నటులకు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరంలో చనిపోతే వారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సాయన్న విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరించిందని సాయన్న అభిమానుల ప్రశ్నలకు మంత్రుల నుంచి సమాధానం రాలేదు. ఎనిమిదో నిజాంగా చెప్పుకునే ముఖరం జా మృతదేశాన్ని టర్కీ నుంచి తీసుకొచ్చిన తర్వాత స్వయంగా సీఎం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారని గుర్తుచేశారు. దళితుడు అయినందువల్లనే సాయన్న విషయంలో ముఖ్యమంత్రి వివక్షతో వ్యవహరించారన్న ఆరోపణలకు మంత్రుల నుంచి సమాధానం లేదు. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సాయన్న అంత్యక్రియల విషయంలో చోటుచేసుకున్న వివాదం.. రాజకీయంగా అధికార పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే విషయం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఇంటికి వచ్చి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళుర్పించిన సీఎం.. అంత్యక్రియల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. ఆలోచన రాలేదనే మాటలకంటే.. వివక్ష కారణంగానే నిర్ణయం తీసుకోలేదంటూ మంత్రులను, ఎమ్మెల్యేలను సాయన్న అభిమానులు ముఖం మీదనే నిలదీశారు.
గతంలో అధికారిక లాంఛనాలతో జరిగిన పలువురి అంత్యక్రియలు
- సినీ నటుడు కృష్ణ
- సినీ నటుడు కృష్ణంరాజు
- సినీ నటుడు కైకాల సత్యనారాయణ
- సినీ దర్శకుడు కే విశ్వనాధ్
- ఎనిమిదో నిజాం రాజు ముఖరం జా