- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ఆ పార్టీకి MLC సీటు ఇవ్వడం కుదరదు’.. తేల్చి చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: మజ్లీస్ పార్టీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం సాధ్యం కాదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడమే అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించిన విషయాన్ని గుర్తు చేసి, అసెంబ్లీ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం కుదరదని సంకేతాలను రాష్ట్ర నేతలను పంపినట్లు తెలుస్తున్నది. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు ఆపార్టీ లీడర్లకే దక్కనున్నాయి.
భవిష్యత్ లో చూద్దాం..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ తో స్నేహాన్ని కటీఫ్ చేసుకున్న మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటోంది. అసెంబ్లీలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సర్కారుకు సపోర్టుగా మాట్లాడారు. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును మజ్లీసుకు కేటాయించి, మిగతా 3 సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులకు కేటాయిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ జాతీయ స్థాయిలో ఎంఐఎం పార్టీ తీరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నందున ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వొద్దన్న నిర్ణయం ఏఐసీసీ నేతలు తీసుకున్నట్లు తెలిసింది. భవిష్యత్ లో ఆపార్టీ తీరులో ఏమైనా మార్పు వస్తే అప్పుడు ఆలోచిద్దామని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లీస్ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని లేకపోతే గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం అంత సులువు కాదని స్టేట్ లీడర్లు అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. దీనితో ఈ ఏడాది మే లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ కానున్న సీటును మజ్లీస్ కు కేటాయిద్దామనే సంకేతాలను ఇచ్చినట్లు తెలిసింది.
అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం
అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈనెల 10 చివరి తేదీ కాగా, ఈలోపే సీఎం ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ గెలుచుకునే నాలుగు సీట్లను ఎవరికి కేటాయించాలో క్లారిటీ తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. ఈసారి బీసీ వర్గాలకు ఎమ్మెల్సీ సీటు దక్కే చాన్స్ లేదని టాక్. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ కు రాజ్యసభ సీటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని ఇప్పుడు మళ్లీ ఆ వర్గానికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు.