డేటా చోరీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైల్స్, కంప్యూటర్స్ మిస్సింగ్?

by GSrikanth |   ( Updated:2024-01-08 08:09:05.0  )
డేటా చోరీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైల్స్, కంప్యూటర్స్ మిస్సింగ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా కీలకమైన ఫైల్స్ మాయమవుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పలు శాఖలకు కీలక సమాచారం కలిగిన చెందిన పత్రాలు, కంప్యూటర్లు అదృశ్యం అవుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయం అన్న అంచనాలు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రుల కార్యాలయాల్లో కీలకమైన ఫైల్స్ అదృశ్యం కాగా తాజాగా కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైన సమాచారం నిక్షిప్తం చేసిన ఐదు కంప్యూటర్లు, ఎలక్ట్రానికి పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. అత్యంత సురక్షితంగా, గోప్యంగా ఉండాల్సిన ప్రభుత్వ డేటాను ఇలా తస్కరిస్తుండటం వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.

మిడ్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వివరాలు మాయం:

తాజాగా కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన చోరీ ఘటనలో ఐదు కంప్యూటర్లు, ఎలక్ట్రానికి వస్తువులను దుండగులు అపహరించారు. ఈ చోరీ సమయంలో కార్యాలయంలో సీసీ కెమెరాలు సైతం పని చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చోరీకి గురైన కంప్యూటర్లలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పాటు నీటిపారుదలశాఖకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయం అయిందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన తర్వాత టూరిజం శాఖలో ఫైర్ యాక్సిడెంట్ కావడం ఈ ఘటనలో కంప్యూటర్లు కాలిపోవడం దుమారం సృష్టించగా ఆ తర్వాత మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ ఆఫీస్ లో కీలక పత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులు చోరీకి గురయ్యాయి. ఇక బషీర్ బాగ్ లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో ప్రవేశించిన ఇద్దరు కొన్ని పత్రాలతో పారిపోవడం కలకలం రేపింది. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ అదే ఆవరణంలో ఉండటంతో ఈ ఘటన అనేక అనుమానాలకు తావిచ్చింది.

బండారం బయటపడుతుందనే చోరీలు :

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ మాయం కావడం, అగ్నిప్రమాదాల్లో కాలిపోవవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కేసీఆర్ సర్కార్ అవినీతి బాగోతం బయట పడుతుందనే ఆయా శాఖలతో సంబంధం కలిగిన నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేయిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ఒక్కొ డిపార్ట్మెంట్ లో డాటా మాయం అవుతుండటం వెనుక మతలబు ఏంటి అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి బండారాన్ని బయటపెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. ఈ క్రమంలో గత ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న శాఖలకు సంబంధించిన కార్యాలయంలో ఫైల్స్ మాయం అవుతుండటం చర్చనీయాంశం అవుతున్నది. దీంతో ఈ ఫైల్స్ మాయం వెనుక ఉన్నదెవరో గుర్తించి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ప్రజల వైపునుంచి వినిపిస్తోంది.

Advertisement

Next Story